జక్రాన్‌పల్లి, ఏప్రిల్ 24:ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నడుపుతున్న ప్రైవేట్ బస్సులు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. శుక్రవారం రాత్రి ఆర్మూర్ డిపోకు చెందిన ప్రైవేట్ బస్సు డ్రైవర్ కమ్ ఓనర్ అరుణ్‌కుమార్ 20 మంది ప్రయాణికులతో కామారెడ్డి నుంచి ఆర్మూర్‌కు బయల్దేరారు.
అర్గుల్ వద్ద ప్రయాణికులను దింపడానికి బస్సును ఆపి, తిరిగి జాతీయ రహదారిపైకి వస్తుండగా, వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఆ లారీని వెనుకాలే వస్తున్న మరో లారీ ఢీకొట్టింది. దీంతో బస్సులోని 12 మంది గాయపడగా, హుటాహుటిన ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.