హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీజీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో చార్జీలు విపరీతంగా పెంచిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ మండిపడ్డారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో పెంచిన ఆర్టీసీ చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ఎలక్ట్రిక్ బస్సు స్టేషన్ల ఏర్పాటు కోసమే చార్జీలు పెంచుతున్నామని ఆర్టీసీ యాజమాన్యం చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. పండుగ సీజన్లో చార్జీలు 50శాతం మేర పెంచిన ఆర్టీసీ యాజమాన్యం.. ఇప్పుడు మళ్లీ చార్జీలు పెంచడం తగదని సూచించారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకుండా ప్రజలపై చార్జీల భారం మోపడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఆర్టీసీలో కార్గో సేవలను ప్రైవేటీకరించే ప్రయత్నాలను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. లేకపోతే ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.