హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వన మహోత్సవం కార్యక్రమం అధికారుల అలసత్వం, పాలకుల పట్టింపులేని కారణంగా నత్తనడకన సాగుతున్నది. దీంతో మొక్కలు నాటే పనులు ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనుకకు అన్నట్టుగా కొనసాగుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హరితహారం పేరు మార్చి, వనమహోత్సవం పేరుతో మొక్కల నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ప్రారంభంలో హడావుడిగా పనులు మొదలు పెట్టినా ఏమాత్రం ముందుకు సాగడంలేదు. వాస్తవానికి రాష్ట్రంలో ఈ ఏడాది 18కోట్ల మొక్కలు నాటాలని అధికారులు నిర్దేశించుకున్నారు. అయితే ఇప్పటివరకు కనీసం 16 కోట్ల మొక్కలు కూడా నాటలేకపోయారు. పైగా మొక్కలు నాటడానికి కావాల్సిన స్థలాలు లభించడం లేదంటూ కొందరు ఉన్నతాధికారులు చెప్పడం గమనార్హం. నిర్దేశించుకున్న లక్ష్యంలో 15.80కోట్ల వద్దే నిలిచిపోగా, 18కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని ఎప్పటివరకు పూర్తిచేస్తారో అనే దానిపై అధికారుల్లో స్పష్టత లేకుండాపోయింది.
పైగా మరో రెండు నెలల్లో వేసవికాలం ప్రారంభం కానునున్నది. ఈలోగా ఈ కార్యక్రమం ముగిస్తారా? లేదా అర్థాంతరంగా ముగింపు పలుకుతారా? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉన్నది. కాగా, సెప్టెంబర్ మూడోవారం నాటికి 13.80 కోట్ల మొక్కలు నాటినట్టు అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కానీ, ఈ మూడునెలల కాలంలో కేవలం 2 కోట్ల మొక్కలు నాటినట్టు అధికారిక లెక్కలు చెప్పుతున్నాయి. ఈ ప్రాతిపదిక చూస్తే.. మరో 2.50 కోట్ల మొక్కలు నాటడానికి మరో నాలుగు నెలల సమయమైనా పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే ఈ ఏడాదిలో నిర్దేశించుకున్న లక్ష్యం 18 కోట్ల మొక్కల నాటే కార్యక్రమం దాదాపు అసాధ్యమనే స్పష్టమవుతున్నది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని వన మహోత్సవం లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.