Bulldozer Raj | హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): దొంగరాత్రి నిర్మాణాల మీదికి వస్తున్న బుల్డోజర్లు.. ఇంట్లో ఉన్నవారు బయటకు వచ్చి చూసే లోపే ప్రహరీగోడలను తొక్కుకుంటూ ఇండ్ల మీదికి వస్తున్న భారీ పొక్లెయినర్లు.. నగర శివార్లలో ఇప్పుడు ఇవే భీతావహ దృశ్యాలు ఆ ప్రాంత నివాసులలో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండ ఉత్తరప్రదేశ్‌లో రాజ్యమేలుతున్న బుల్డోజర్ల సంస్కృతిని గుర్తుకు తెస్తున్నదని నగరవాసులు అంటున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బాటలోనే తెలంగాణ ప్ర భుత్వం కూడా నడుస్తున్నదని అభిప్రాయపడుతున్నారు. గడిచిన నెల రోజులుగా అక్రమ నిర్మాణాల కూల్చివేత పేరుతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఏకపక్షంగా ఉంటున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.
అక్రమార్కుల భర తం పట్టే విషయం ఎలా ఉన్నా.. ఆ పేరుతో అరాచక పాలనకు తెరతీస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం నోటీసు ఇవ్వకపోవడం.. బాధితుల వాదన వినకపోవడం.. న్యాయం కోసం కోర్టును సంప్రదించే సమ యం కూడాఇవ్వకపోవడం.. కనీసం ఇంట్లో సామాన్లన్నా బయటకు తెచ్చుకొనే సమయం ఇవ్వకుండా అధికారులు అరాచకంగా వ్యవహరిస్తున్న వైనంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. హైడ్రా అధికారులు రాత్రికి రాత్రి వచ్చి లోపల ఉన్నవారిని అందరినీ బయటకు వెళ్లగొట్టి కూల్చివేతలు ప్రారంభిస్తున్నారు. ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, విలువైన ఫర్నిచర్.. ఇలా వస్తువులన్నింటినీ ధ్వంసం చేస్తున్నారు. విద్యాసంస్థల నిర్మాణాలపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. విద్యాసంవత్సరం మధ్యలో ఉద్దేశపూర్వకంగా తరగతి గదులనూ కూల్చే ప్రయ త్నం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
న్యాయస్థానాలకు వెళ్లకుండా..దొంగరాత్రే..
హైడ్రా పేరుతో నగరంలో గత నెల రోజులుగా సాగుతున్న కూల్చివేతలను గమనిస్తే.. అంతా ఓ పథకం ప్రకారం, అర్థరాత్రి లేదా తెల్లవారుజామునే పనిని ప్రారంభిస్తున్నట్టు స్పష్టమవుతున్నది. లేదా సెలవు రోజు తెల్లవారు జామున కూల్చివేతలను చేపడుతున్నారు. ఉదయం పది గంటలలోపే తమ టార్గెట్‌ను నేలమట్టం చేసేస్తున్నారు. బాధితులకు న్యాయపరమైన ఊరట లభించకుండా ఉండేందుకే వ్యూహాత్మకంగా తమ కూల్చివేతలను చేపడుతున్నట్టు తెలుస్తున్నది. ఒకవేళ నోటీసులు ఇచ్చి, పనిదినాల్లో, పనివేళల్లో నిర్మాణాలను కూల్చేందుకు వెళ్తే యజమానులు అలర్ట్‌గా ఉంటారని, వారు అప్పటికప్పుడు తమ బాధను న్యాయస్థానానికి చెప్పుకునే అవకాశం లభిస్తుందని, ఉన్నతాధికారులతో లేదా ఇతరులతో ఫోన్లు చేయించి తమ పనిని అడ్డుకుంటారని, ఆ అవకాశం ఇవ్వకుండా ఉండేందుకే అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున, సెలవు దినాల్లో కూల్చివేతలు చేపడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. బాధితులు కోర్టులకు వెళ్లి తమ గోడును వెళ్లబోసుకునేలోపే వారి ఆస్తులను నేలమట్టం చేస్తున్నారు. బాధితులు తాము నిరపరాధులమని, తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పుకునేలోపే అంతా ముగించేస్తున్నారు.
ఫోన్లు స్విచ్చాఫ్
హైడ్రా చేస్తున్న నిర్మాణాల కూల్చివేతలో మరో ప్రధానమైన అంశం అధికారులు ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకోవడం. ఏ నంబరులో అందుబాటులో ఉన్నారో ఎవ్వరికీ చెప్పకపోవడం.. కమిషనర్ మొదలు అధికారులందరూ ఫోన్లు బంద్ చేసుకుంటున్నారు. కూల్చాల్సిన నిర్మాణాల వివరాలను ఇచ్చి కింది స్థాయి సిబ్బందిని మాత్రమే పంపిస్తున్నారు. ఒకవేళ అధికారుల ఫోన్లు అందుబాటులో ఉన్నా.. ఎవరి ఫోన్లు ఎత్తడంలేదన్న ఆరోపణలున్నాయి.
బుల్డోజర్ రాజకీయమేనా?
ఉత్తర్‌ప్రదేశ్ తరహాలో తెలంగాణలో కూడా ప్రత్యర్థులను భయపెట్టేందుకు బుల్డోజర్లతో రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కేవలం ప్రత్యర్థిపార్టీని, ఆ పార్టీకి అనుకూలంగా ఉండే వర్గాలను టార్గెట్ చేసేందుకే ఈ తరహా కూల్చివేతలు జరుగుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైడ్రా అన్నది ఉత్త హైడ్రామా అని, అసలు ఉద్దేశం వేరే ఉన్నదన్న అభిప్రాయాలు వస్తున్నాయి.