జైనథ్, సెప్టెంబర్ 14 : కుక్కలు దాడి చేయడానికి రావడంతో ఓ ఎద్దు ఇల్లెక్కిన ఘటన ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండల పరిధిలోని నిరాలలో ఆదివారం చోటుచేసుకున్నది. గ్రామస్థుల కథనం ప్రకారం.. రైతు షేక్ గఫూర్ తన ఇంటి ఆరు బయట గూటానికి ఎద్దును కట్టేశాడు. ఆదివారం ఉదయం కుక్కల మంద ఎద్దుపై దాడి చేయడానికి రావడంతో భయంతో తాడును తెంపేసుకొని పక్కనే ఉన్న రాళ్ల కట్టపై నుంచి ఇంటిపైకి చేరింది. గ్రామానికి చెందిన విఠల్ మాస్టర్ ఇల్లు కొంత భాగం దెబ్బతిన్నది. స్థానికులు తాళ్ల సాయంతో ఎద్దును కిందికి దింపారు. ఈ దృశ్యాన్ని గ్రామస్థులు తమ సెల్ఫోన్లలో బంధించారు.