హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలకు నూతన భవనాలను నిర్మిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. రాష్ట్రంలో సొంత భవనంలేని గ్రామ పంచాయతీ ఉండకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పరిపాలనలో సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని, తండాలు, గోండుగూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయం మంత్రి ఎర్రబెల్లి నివాసంలో గురువారం.. తండాలు, ఏజెన్సీగూడేల్లో పంచాయతీ భవనాల నిర్మాణం, నిధులు, విధి విధానాలు, కార్యాచరణ ప్రణాళిక వంటి అంశాలపై మంత్రు లు సమీక్షించారు.
మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలన్నింటికీ కొత్త భవనాలను దశలవారీగా నిర్మిస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయని చెప్పారు. ఇందులో ఎస్టీ గ్రామ పంచాయతీల్లో భవనాలులేని తండాలు 1,097, ఏజెన్సీ ప్రాంతాల్లో 688 ఉన్నాయని చెప్పారు. మైదాన ప్రాంత గ్రామ పంచాయతీల్లో 2,960 గ్రామాలకు భవనాలు లేవన్నారు. మొత్తం 4,745 గ్రామ పంచాయతీలకు కొత్త భవనాల అవసరం ఉన్నదని వివరించారు. వీటిలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల నుంచి ప్రభుత్వానికి అందిన ప్రతిపాదనలకు అనుగు ణంగా భవనాలను నిర్మిస్తామని చెప్పారు. కొన్ని గ్రామాల్లో కొత్త భవనాల నిర్మాణం ప్రగతిలో ఉన్నదని, మరికొన్నింటి పనులను త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు, పీఆర్ ఈఎన్సీ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.
మొత్తం గ్రామ పంచాయతీలు: 12,769
సొంతభవనాల్లేని గ్రామ పంచాయతీలు: 4,745
గిరిజన తండాలు, గోండుగూడేల్లో: 1,097
ఏజెన్సీ ఏరియాల్లో : 688
మైదాన ప్రాంతాల్లో : 2,960