భద్రాచలం, మార్చి 27: శ్రీపతి సేవా ట్రస్టు పేరిట భద్రాచలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఆరు అంతస్థుల భవనం బుధవారం కూలిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారికోసం 30 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. గురువారం శిథిలాల్లో చిక్కుకుపోయిన తాపీమేస్త్రి కామేశ్వర్‌రావును అధికారులు ప్రాణాలతో బయటకుతీశారు. కానీ అప్పటికే కాలు, చెయ్యి నుజ్జునుజ్జయి, తీవ్ర రక్తస్రావం జరిగిన కామేశ్వర్రావు దవాఖానకు తరలించిన వెంటనే ప్రాణాలు వదిలాడు.
ఇంకో తాపీమేస్త్రి ఉపేందర్ కోసం పోలీసుల జాగిలాలతో ఆనవాళ్లు గుర్తించి, శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో బీరువా లాంటి లాకర్ ఒకటి లభ్యమైంది. అందులో విలువైన బంగారం, నగదు, వివిధ పత్రాలు ఉండడంతో అధికారులు పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఐటీడీఏ పీవో రాహుల్, ఆర్డీవో దామోదర్‌రావు, ఏఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్, డీఎఫ్‌వో క్రాంతికుమార్ పర్యవేక్షిస్తున్నారు. సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, పంచాయతీ, ఐటీసీ అధికారులు, సిబ్బంది శిథిలాలను తొలగిస్తూ, ఆనవాళ్లు పరిశీలిస్తూ ముందుకెళ్తున్నారు.