హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): పాఠశాల దశలోనే ఆరో తరగతి నుంచే విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లల్లో కాంపొజిట్ స్కిల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని సూచించింది. సీబీఎస్ఈ ఇటీవలే ప్రిన్సిపాళ్లకు లేఖలు రాసింది. మూడేండ్లల్లో తప్పనిసరిగా ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకోవాలని గడువు విధించింది.
సీబీఎస్ఈ 139వ పాలకమండలి సమావేశంలో ఇదే అంశంపై సుదీర్ఘంగా చర్చించి, ల్యాబ్‌ల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. జాతీయ విద్యావిధానం-2020లో భాగంగా నేషనల్ కరిక్యులం ఫ్రేమ్‌వర్క్‌ను కేంద్ర విద్యాశాఖ విడుదల చేసింది.
6 నుంచి 12 తరగతుల్లో స్కిల్డెవలప్మెంట్ను అంతర్భాగంగా చేర్చింది. 6వ తరగతిలో చేరిన వారు ఏదో ఒక స్కిల్ కోర్సును అభ్యసించాల్సిందే. దీంట్లో భాగంగా బడుల్లో స్కిల్ ల్యాబ్‌లు, వృత్తిశిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది.