Ayyappa Society | హైదరాబాద్ సిటీబ్యూరో/మాదాపూర్, నవంబర్ 21(నమస్తే తెలంగాణ): నగరంలోని మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలకు అంతే లేకుండా పోతున్నది. ఒక్కో అంతస్థుకు ఫలానా రేటు అని ఫిక్స్ చేసి మరీ మామూళ్లు ఇస్తూ నిర్మాణాలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో అక్రమ కట్టడాలు జోరుగా సాగుతున్నాయి. శేరిలింగంపల్లి మండలంలో ఉన్న అయ్యప్ప సొసైటీ 125 ఎకరాల్లో ఏర్పడింది. ఇందులో 1200 ప్లాట్లను ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు కొనుగోలు చేశారు.
అవి సీలింగ్ భూములని, అమ్మకాలు చెల్లవని అప్పట్లో ప్రభుత్వం నిర్మాణాలను అడ్డుకున్నది. క్రమబద్ధీకరణకు దేవాదాయశాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ భూములపై ప్రభుత్వం, ట్రస్ట్, సొసైటీలకు మధ్య సుప్రీంకోర్టులో వివాదం నడిచింది. వివాదం పరిష్కారమయ్యే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని కోర్టు ఆదేశించింది. అయినా, వందల సంఖ్యలో అక్రమ కట్టడాలు కుప్పలు, తెప్పలుగా వెలుస్తున్నాయి.
దీంతో అనధికారిక నిర్మాణాలకు వెలకట్టి మరీ స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు కప్పం వసూలు చేస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలకు స్థలం, విస్తీర్ణాన్ని బట్టి రేటు ఫిక్స్ చేస్తున్నారు. ఫ్లోర్‌కు రూ.1.50 లక్షల నుంచి రెండు లక్షల మేర వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా చిన్న ప్రహరీ కడితేనే ముప్పుతిప్పలు పెట్టే జీహెచ్ఎంసీ అధికారులకు కండ్ల ముందే బడా నిర్మాణాలు జరుగుతున్నా పట్టకపోవడం గమనార్హం.