Buildox | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబరు 25 (నమస్తే తెలంగాణ): సోషల్ మీడియా వేదికగా గ్రాఫిక్ డిజైన్లు ఎరవేసి కొనుగోలుదారులను మోసిగించే ప్రయత్నం చేసిన రియల్ ఎస్టేట్ సంస్థ బిల్డాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ బాగోతం బయటపడింది. కొనుగోలుదారుడి ఫిర్యాదుతో తీగ లాగితే డొంక కదిలింది. ప్రాజెక్టు లేకుండానే ప్లాట్లను విక్రయించిన అడ్డంగా దొరికిపోయింది. కొండాపూర్ సమీపంలోని హఫీజ్పేట్ సర్వే నంబర్ 80 పరిధిలో బిల్డాక్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఫేస్బుక్ వేదికగా ‘ద కాంటినెంట్ ప్రాజెక్టు’ను చేపడుతున్నట్టు ప్రీ లాంచ్ అమ్మకాలకు దిగింది. అయితే, ఎలాంటి అనుమతులు లేకుండానే బిల్డాక్స్ అమ్మకాలు సాగిస్తున్నట్టు అందిన ఫిర్యాదుపై రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) సీరియస్ అయింది. కంపెనీకి రూ. 1.6 లక్షల జరిమానా విధించిన రెరా అధికారులు, కొనుగోలుదారుడు చెలించిన రూ. 2 లక్షల అడ్వాన్స్ వెనక్కి ఇవ్వాలని ఆదేశించారు.
వినియోగదారుడి ఫిర్యాదుతో వెలుగులోకి
అనుమతి లేకుండానే బిల్డాక్స్ కంపెనీ ప్లాట్ల అమ్మకాలు చేపడుతున్నట్టు శరత్ అనే కొనుగోలుదారుడు రెరాలో ఫిర్యాదు చేశారు. హెక్సాస్కై ఇన్ఫ్రా సంస్థ ద్వారా అమ్మకాలు జరుగుతున్నాయని, దీని డైరెక్టర్గా చెప్పుకునే దామోదర ప్రసాద్ బిల్డాక్స్ కార్యాలయంలో తనతో మాట్లాడారని చెప్పారు. 2028 నాటికి ఫ్లాట్ హ్యాండోవర్ చేస్తానని హామీ ఇవ్వడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ. 2 లక్షలు అడ్వాన్స్ చెల్లించినట్టు తెలిపారు. అయితే, ఆ తర్వాత ఆరా తీస్తే బిల్డాక్స్ ప్రాజెక్టుకు అసలు అనుమతులే లేవని, ప్రాజెక్టును ప్రతిపాదించిన భూమి కూడా వివాదంలో ఉన్నదని తెలిసిందని పేర్కొన్నారు. మోసపోయినట్టు భావించి రెరాను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన రెరా బిల్డాక్స్ అక్రమాలకు పాల్పడిందని, బ్యాంకు అకౌంట్ స్టేట్మెంట్ల ఆధారంగా అక్రమాలు జరిగినట్టు నిర్ధారించింది. దీంతో రెరాకు రూ. 1.6 లక్షల జరిమానా విధించింది. బాధితుడు శరత్ చెల్లించిన రూ. 2 లక్షలు తిరిగి ఇవ్వాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టులో కేసు
హఫీజ్పేట్ సర్వే నంబర్ 80 పరిధిలోని భూమి విషయంలో ప్రభుత్వానికి, కొందరు ప్రైవేట్ వ్యక్తులకు మధ్య సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది. ఆ విషయాన్ని దాచిపెట్టి బిల్డాక్స్ సంస్థ ప్రీలాంచ్ దందాకు తెరలేపింది. కొనుగోలుదారులకు తెలియకుండా సోషల్మీడియా వేదికగా 30 ఎకరాలకు పైగా స్థలంలో 35 అంతస్తులను నిర్మిస్తామని చెప్తూ ప్లాట్లు విక్రయిస్తున్నది. రెండు వారాల్లో వందశాతం సొమ్ము చెల్లించే వారికి చదరపు అడుగును రూ.4,500కే ఇస్తామని నమ్మించింది. సుప్రీంకోర్టులో ఈ స్థలంపై వివాదం కొనసాగుతున్నప్పటికీ బిల్డాక్స్ అమ్మకాలు జరుపుతూ వచ్చింది. ఇది బిల్డాక్స్- వాసవి సంస్థ జాయింట్ వెంచర్ అని ఏజెంట్లు చెప్తుండడం గమనార్హం.
అంటకాగుతున్న వాసవి
నిజానికి బిల్డాక్స్ కంపెనీ నగరంలో భారీ ప్రాజెక్టులు చేపట్టింది లేదు. కానీ, హైరైజ్ ప్రాజెక్టుల పేరిట అమాయకులను మోసం చేస్తూ వస్తున్నది. ఈ క్రమంలో అత్యంత డిమాండ్ ఉన్న హఫీజ్పేట్ ప్రాంతంలోని వివాదస్పద భూమిని కేంద్రంగా చేసుకుని వ్యాపారానికి తెరలేపింది. ఈ క్రమంలో కలర్ఫుల్ డిజైన్లు, గ్రాఫిక్ వీడియోలతో సోషల్ మీడియాలో సామాన్యుడి కలల ప్రపంచాన్ని సృష్టించింది. ఎలాంటి అనుమతులు, నిర్మాణ కార్యకలాపాలు లేకుండా కార్పొరేట్ సంస్థల మాటున రియల్ మోసాలకు తెగబడిందనే ఆరోపణలు ఉన్నాయి. సర్వే నంబర్ 80లో తవ్వకాలు లేకుండానే ఫ్యూచర్ డెవలప్మెంట్ ప్రాజెక్టుగా చిత్రీకరించి నిబంధనలకు విరుద్ధంగా ప్రీ లాంచ్కు తెగబడింది. దీంతో అందిన కాడికి అమాయకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికీ ఆ స్థలం సుప్రీంకోర్టు పరిధిలోనే ఉందనీ, దానిపై స్టేటస్ కో కొనసాగుతున్నదని పలువురు తెలిపారు. వరల్డ్ క్లాస్ హైరైజ్ ప్రాజెక్టు పేరిట జనాల సొమ్ములను లాగేసుకున్న బిల్డాక్స్ కంపెనీతో హైదరాబాద్ కేంద్రంగా ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ వాసవి గ్రూప్ అంటకాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. కాగితాలకే పరిమితమైన ద కాంటినెంట్ ప్రాజెక్టును బూచిగా చూపెట్టి, అమాయకులను మోసం చేస్తున్న కంపెనీతో కలిసి వాసవి గ్రూప్ గుండ్లపోచంపల్లి ప్రాంతంలో లగ్జరీ ప్రాజెక్టును చేపట్టింది. వాసవి బిల్డాక్స్ భువీ పేరిట ప్రాజెక్టును నిర్మిస్తున్నది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఉండగా తాజాగా వెలుగులోకి వచ్చిన బిల్డాక్స్ ప్రీ లాంచ్ బాగోతాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.