Telangana | హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థిక ప్రగతిని, ప్రజల జీవన విధానాన్ని మార్చిన కేసీఆర్ సంక్షేమ పథకాల ప్రస్తావన బడ్జెట్లో కనిపించలేదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన పథకాలకు కూడా బడ్జెట్లో చోటు దక్కలేదు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలన్న ఆలోచనతో రేవంత్ సరార్ తీసుకుంటున్న ప్రతీకారేచ్ఛ నిర్ణయాలు బీద, పేద, బడుగు బలహీనవర్గాలకు పెను శాపంగా మారుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో తన రెండో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. బీసీ బంధు, దళిత బంధు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, సీఎం బ్రేక్ ఫాస్ట్, విదేశీ విద్యానిధి, పల్లెప్రగతి, పట్టణప్రగతి, సాగునీటి.. సహా అన్ని పథకాలను నిర్దాక్షిణ్యంగా అటకెకించింది. ఇవి ప్రజామోదం లేని పథకాలైతే వీటిని తక్షణమే రద్దు చేస్తున్నామని ప్రకటించాని, లేదంటే బడ్జెట్లో తగిన నిధులు కేటాయించి అమలు చేయాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
బీసీలకు లక్ష పథకం ప్రస్తావన ఏది?
నాయీ బ్రాహ్మణులు, కుమ్మరి, విశ్వబ్రాహ్మణులు, నేత.. ఇలా కులవృత్తులపై ఆధారపడి జీవించేవారికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందించే లక్ష్యంతో బీసీ బంధు పథకాన్ని కేసీఆర్ అమల్లోకి తెచ్చారు. 4.16 లక్షల మంది ఈ పథకానికి అర్హులని తే ల్చారు. 40 వేల మందికి చెకులు అందజేశారు. మిగతా 3.76 లక్షల మందికి చెక్కులు ఇవ్వాల్సి ఉన్నది. అయితే, రేవంత్‌రెడ్డి ప్రభు త్వం ఈ పథకాన్ని పకనపెట్టింది. గత బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. బీసీవాదం బలంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభు త్వం మధ్యలో నిలిపివేసిన బీసీ బంధుకు ఈసారి బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని తెలంగాణ యువత ఆశించింది. కానీ, ఈ సారి కూడా బీసీ బంధు ప్రస్తావన లేకుండానే బడ్జెట్‌ను మమ అనిపించారని యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నది.
విదేశీ విద్యానిధి లేనట్టే
బీసీల కోసం పూలే పేరుతో, ఎస్సీ, ఎస్టీల కోసం అంబేదర్ పేరుతో ఓవర్సీస్ సాలర్షిప్లను బీఆర్ఎస్ సర్కారు అందించింది. దీనికి విదేశీ విద్యానిధి పథకం పేరిట కేసీఆర్ ప్రభుత్వం దీన్ని అమలు చేసింది. పేద బ్రాహ్మణులకు కూడా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా ఈ పథకాన్ని అమలు చేసింది. దాదాపు మూడు వేల మందికి ఓవర్సీస్ సాలర్షిప్లు అందించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకం ఉన్నదో, లేదో అర్థం కాని అయోమయంలో విద్యార్థులు ఉన్నారు. ఈసారి బడ్జెట్లో విదేశీ విద్యా పథకానికి నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయని తొలుత అధికారులు అంచన వేశారు. కానీ, బడ్జెట్లో ఈ పథకం ప్రస్థావన లేకపోవటంతో విద్యార్థులు నిరాశకు లోనయ్యారు.
ప్రాజెక్టులదీ అదే గతి
కనీవినీ ఎరుగని భారీ ప్రాజెక్టులతో రాష్ట్ర నీటిపారుదల రంగం ముఖచిత్రాన్ని మార్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. కాంగ్రెస్ పార్టీ సాగునీటి రంగా న్ని మరింత ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ధోకా చేసిందని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డపై చేస్తున్న రాజకీయం, తద్వారా అన్నదాతలు ఎదురొంటున్న కష్టాలు అందరికీ తెలిసిందే. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు చివరి దశలో ఉన్నాయి. సంగమేశ్వర-బసవేశ్వర ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆపేసింది. ఈసారి బడ్జెట్లో మేడిగడ్డ బరాజ్ మరమ్మతుల కోసం, సంగమేశ్వర-బసవేశ్వర ప్రాజెక్టులకు ఇతోధికంగా నిధులు కేటాయిస్తుందని రాష్ట్ర రైతాంగం అంచనా వేసింది. కానీ, ఈ బడ్జెట్లో కూడా మొండిచెయ్యే చూపించటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అటకెక్కిన గొర్రెల పథకం
గొర్రెల పంపిణీ పథకం అమల్లోకి తెచ్చిన కేసీఆర్ ఒకో యూనిట్‌కు 21 గొర్రెలు చొప్పున అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి.. మొదటి, రెండు విడతల్లో కలిపి బీఆర్ఎస్ ప్రభుత్వం 4.2 లక్షల యూనిట్లు పంపిణీ చేసింది. రెండో విడత కింద ఇంకా గొర్రెల పంపిణీ జరగాల్సి ఉన్నది. డబ్బులు కట్టిన యాదవ కుటుంబాలు గొర్రెల కోసం ఎదురుచూస్తున్నాయి. బడ్జెట్లో గొర్రెల పథకానికి చోటే కల్పించలేదని యాదవ సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆకలితో అలమటిస్తున్న విద్యార్థులు
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉదయం పూట ఆకలి తీర్చేందుకు సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకానికి కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 27,147 పాఠశాలల్లో, దాదాపు 23 లక్షల విద్యార్థులకు లబ్ధి చేకూర్చేలా ఈ పథకానికి రూపకల్పన చేసింది. ఇందుకోసం రూ.672 కోట్లు కేటాయించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తి గా పకన పెట్టేసింది. అట్లాగే గర్భిణుల్లో పోషకాహార లోపం నివారించటం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ పథకాన్ని ప్రారంభించింది. సుమారు 6.84 లక్షల మంది గర్భిణులకు కిట్లు అందించాలని సంకల్పించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తుందో.. లేదో ఇప్పటి వరకు చెప్పడం లేదు.
పల్లెప్రగతి, పట్టణ ప్రగతి పథకాలు మాయం
గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. బడ్జెట్ కేటాయింపులు చేసి, సమగ్ర కార్యాచరణతో పనులు చేపట్టింది. ఫలితంగా పల్లెల్లో, పట్టణాల్లో మౌలిక వసతులు సమకూరాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు గణనీయంగా తగ్గాయి. ప్రజల ఆరోగ్యం మెరుగుపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాలను పకనపెట్టింది. టీఎస్ ఐపాస్‌లో సింగిల్ విండో అనుమతుల విధానం దేశ పారిశ్రామిక రంగంలోనే వినూత్న ప్రయత్నంగా ప్రశంసలు అందుకున్నది. ఈ బడ్జెట్లో టీఎస్ ఐపాస్ ప్రస్తావన లేదని పారిశ్రామికవర్గాలు పెదవి విరుస్తున్నాయి.
దళిత బంధువులకు దగా
ఒకో దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున సాయం అందించి, వారు తమకు నచ్చిన, నైపుణ్యం ఉన్న రంగంలో వ్యాపారులుగా ఎదిగేందుకు కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన దళిత బంధు చేయూత అందించింది. ఈ క్రమంలో 40 వేల కుటుంబాలకు దళితబంధును మంజూరు చేసింది. మరో 1.30 లక్షల మందికి ప్రొసీడింగ్స్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల హామీల్లో భాగంగా దళితబంధును రూ.12 లక్షలకు పెంచి అమలు చేస్తామని ప్రకటించింది. కానీ, గత బడ్జెట్లో కాని, ఈ బడ్జెట్లో కాని దళిత బంధుకు నిధులు కేటాయించకపోవటంతో దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
బస్తీ దవాఖానలకు సుస్తీ .
నగరంలో ప్రతి 10 వేల మందికి ఒక బస్తీ దవాఖానను కేసీఆర్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ దవాఖానల్లో 57 రకాల వ్యాధులకు వైద్య సేవలు అందుబాటులో ఉండేవి. అనతికాలంలోనే బస్తీ దవాఖానలు ప్రజల మన్ననలు పొందాయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం బస్తీ దవాఖానాలను నిర్వీర్యం చేసింది. కొద్ది మొత్తం నిధుల ఖర్చుతో ప్రజలకు వైద్య సేవలు అందించే ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవటం మానేసింది. ఇలా ఒకటా.. రెండా ప్రజారంజక పథకాలన్నింటినీ రేవంత్ ప్రభుత్వం అటకెక్కించింది
జాబ్ క్యాలెండర్ ఏది?
బడ్జెట్లో జాబ్ క్యాలెండర్ ప్రస్తావన లేకపోవడం బాధాకరం. ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని గొప్పలు చెప్పిన సీఎం రేవంత్, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదేందుకు? నిరుద్యోగుల బతుకులతో సీఎం రేవంత్ చెలగాటమాడుతున్నారు.
– ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
గ్యారెంటీలకు పాతర
ఈ బడ్జెట్ పెద్ద బోగస్. ఏ ఒక్క వర్గానికి ఊరటనివ్వలేదు. రాష్ట్రాన్ని తిరోగమనం పట్టించేలా ఉన్న దిశ, దశ లేని దిక్కుమాలిన బడ్జెట్ ఇది.
– మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
అసమర్థతకు నిదర్శనం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసమర్థ పాలనకు ఈ బడ్జెట్టే నిదర్శనం. వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలను తుంగలో తొక్కి, అందు లోని అంశాలను తప్పుదారి పట్టించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నది.
– పుట్ట మధూకర్, మాజీ ఎమ్మెల్యే
మోసపూరితమే..
బడ్జెట్లో సర్కారు అన్ని వర్గాలను మోసం చేసింది. మహిళలకు ఇస్తానన్న రూ.2500 నగదు ఊసే లేదు. కాలేజీ విద్యార్థినులకు సూటీ ఇస్తామన్న మాట తప్పారు. ఇది రేవంత్‌రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనం.
– కల్వకుంట్ల విద్యాసాగర్ రావు,బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు
కోతల బడ్జెట్
రుణమాఫీ, రైతుభరోసాకు కోతలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొల్లాపూర్ ప్రాంతంలోని మినీ లిఫ్ట్‌లతోపాటు సాగునీటి రంగానికి, కొల్లాపూర్ ప్రాంతంలో రాష్ట్ర సాంకేతిక విద్యాసంస్థలకు నిధులు కేటాయించలేదు.
– బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
దున్నపోతుకు పాలు పిండినట్టు బడ్జెట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దున్నపోతుకు పాలు పిండినట్టు ఉంది. గ్యారెంటీల అమలుపై ప్రజలు ఆశలు వదులుకునేలా పద్దులను రూపొందించారు. అంకెల గారడీతో ప్రజలను మరోసారి మోసం చేశారు.
– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
దివాలాకోరు బడ్జెట్
ఇది దివాలాకోరు బడ్జెట్. పేదల వ్యతిరేక బడ్జెట్. ఆరు గ్యారెంటీలతోపాటు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు వెన్నుపోటు పొడిచేలా ఉన్నది. పేదల సంక్షేమాన్ని విస్మరించి.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పేకమేడలా కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూల్చింది.
– వనమా వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి
హామీల ఎగవేతల బడ్జెట్
రాష్ట్ర బడ్జెట్ హామీల ఎగవేతల బడ్జెట్‌లా ఉన్నది. రాష్ర్టాన్ని దివాలా తీసేలా పెట్టారు. ఆదాయం చారానా, అప్పు బారానా అన్నట్టుగా ఉంది.
– ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీజేపీఎల్పీ నేత
ఖర్చులో శూన్యం
రాష్ట్ర బడ్జెట్ అంకెల్లో గణం, ఖర్చులో శూన్యం అన్న చందంగా ఉన్నది. విద్య, వైద్య రంగానికి సరైన కేటాయింపులు జరగలేదు. ఎన్నికల హామీలపై ప్రభు త్వం చేతులెత్తేసినట్టు స్పష్టమవుతున్నది.
– ఎర్రోజు శ్రీనివాస్, బీఆర్ఎస్ నేత
గిరిజనులకు అన్యాయం
బడ్జెట్లో గిరిజనులకు తీవ్ర అన్యా యం జరిగింది. తండాలు, గూడెం పం చాయతీలకు ఇస్తామన్న రూ.25 లక్షలు, ఎస్టీలకు రూ.12లక్షల సాయం విషయమై కేటాయింపులు లేవు.
– రాంబల్ నాయక్
మైనార్టీ డిక్లరేషన్‌కు సమాధి
బడ్జెట్ సాక్షిగా మైనార్టీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం సమాధి చేసింది. రేవంత్‌రెడ్డి మైనార్టీల సమస్యల పరిష్కారంపై చిన్నచూపు చూస్తున్నారు.
– మేడే రాజీవ్ సాగర్
నిరుద్యోగులకు మోసం
బడ్జెట్‌ను చూస్తే నిరుద్యోగులను మో సం చేసినట్టు అర్థమవుతుంది. వైద్య, విద్యారంగాలకు ఆశించిన మేర కేటాయింపులు లేవు.
– కేతిరెడ్డి వాసుదేవరెడ్డి
అంకెల గారడీలా బడ్జెట్
బడ్జెట్ అంకెల గారడీలా ఉన్నది. విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయిస్తామని ప్రగల్భాలు పలికి.. కేవలం 7.5 శాతం మాత్రమే కేటాయించారు.
– తొనుపునూరి శ్రీకాంత్‌గౌడ్,బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
విద్యారంగానికి అన్యాయం
సరైన కేటాయింపులు చేయకుండా విద్యారంగాన్ని సర్కారు నిర్లక్ష్యం చేసింది. 15 శాతం నిధులేవీ?
– ఏబీవీపీ
అబద్ధాల చిట్టా
అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అబద్ధాల చిట్టాను తలపిస్తున్నది. పందేండ్ల కేసీఆర్ పాలన వికాసాన్ని.. 15 నెలల కాంగ్రెస్ పాలన ఛిద్రం చేసింది. పచ్చబడిన ప్రాంతాలను కాంగ్రెస్ ఎండిబెట్టి చోద్యం చూస్తున్నది. మళ్లీ బిందెలు చేతిలో పట్టుకుని మహిళలు నీళ్ల కోసం పరుగులు తీస్తున్నారు. హరితహారం మొక్కలు, పంటలు ఎండుతున్నాయి. రైతులను నష్టాల పాలు చేసింది. రేవంత్ సర్కారు
బడ్జెట్‌ను అబద్ధాలతో వండి వార్చింది. – సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ మంత్రి