హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహకాలివ్వకుండా మొండిచేయి చూపారని క్రెడాయ్ అధ్యక్షుడు వీ రాజశేఖర్రెడ్డి, జనరల్ సెక్రటరీ బీ జగన్నాథరావు మండిపడ్డారు. బడ్జెట్ ఆశాజనకంగా లేదని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పెరుగుతున్న పట్టణీకరణకు బడ్జెట్లో కేటాయించిన రూ.లక్ష కోట్లు ఏ మూలనా సరిపోవని అభిప్రాయపడ్డారు.
ఆగిపోయిన హౌసింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కేటాయించిన నిధులు కూడా అంతంత మాత్రమేనని పెదవి విరిచారు. డిమాండ్ తగ్గట్లుగా బడ్జెట్లో కేటాయింపులు జరగలేదని, వాస్తవికతను గుర్తించడంలో కేంద్రం విఫలమైందని చెప్పారు. ఇటీవల విడుదలైన ఆర్థిక సర్వే ప్రకా రం నిధులు కేటాయిస్తే బాగుండేదని స్పష్టం చేశారు.