నందికొండ, మే 5: ప్రపంచ దేశాలకు బౌద్ధ ధర్మమే దిక్సూచిగా మారి జాతీయ సమైక్యతకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడ్పడుతున్నదని యూజీసీ పూర్వ చైర్మన్ సుఖదేవ్ థోరట్ అన్నారు. నల్లగొండ జిల్లా నందికొండలోని బౌద్ధ వారసత్వ థీమ్ పార్కు బుద్ధవనంలో బుద్ధ్ద జయంతి వేడుకలను తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య అధ్యక్షతన శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నుంచి బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో 200 కార్లతో ర్యాలీగా బుద్ధవనం చేరుకున్నారు. ఈ బృందానికి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ ఘన స్వాగతం పలికారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, మహాబోధి సొసైటీ సంఘపాల బౌద్ధ భిక్షువులు, కర్ణాటక బౌద్ధ భిక్షువులతో కలిసి ఎమ్మెల్యే నోముల భగత్ బుద్ధ చరిత వనంలో బుద్ధుడి పాదాలకు పుష్పాంజలి ఘటించారు.
అంతకుముందు బుద్ధవనంలో టిబెట్ హెర్బల్ మెడికల్ క్యాంప్‌ను ముఖ్య అతిథి యూజీసీ పూర్వ చైర్మన్ సుఖదేవ్థోరట్ బుద్ధవనం ఓఎస్డీ సుధాన్రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మహా స్తూపంలో ఏర్పాటు చేసిన సమావేశ మందిరంలో బౌద్ధ భిక్షువు లు ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుఖదేవ్ థోరట్ మాట్లాడుతూ.. బౌద్ధతాత్వికత నేటి సమాజంలో జాతీయ భావం, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎలా తోడ్పడుతుందో వివరించారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ బుద్ధవనాన్ని అంతర్జాతీయ స్థాయి వారసత్వ కేంద్రంగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్, పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ సహకరించారని అన్నారు. బుద్ధవనం ప్రత్యేకతలు, ప్రగతి గురించి ఆయన వివరించారు. అంతకుముందు సీఎం కేసీఆర్ పంపించిన సందేశాన్ని చదివి వినిపించారు. అతిథులను, భిక్షువులను మల్లేపల్లి లక్ష్మయ్య జ్ఞాపికలు, శాలువాలతో సన్మానించారు. అనంతరం ఇల్యూమినేషన్ లైటింగ్‌ను సుఖదేవ్థోరట్తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో విమల థోరట్, బీఎస్ఐ తెలంగాణ అధ్యక్షుడు పరంధాములు
తదితరులు పాల్గొన్నారు.