హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): డిగ్రీ కోర్సుల నిర్వహణలో భాగంగా తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. నచ్చిన కోర్సులను ఎంపిక చేసుకునే బకెట్ ఆఫ్ కోర్సెస్ (బీవోసీ) సిస్టమ్‌కు ముగింపు పలికింది. మళ్లీ పాత విధానానికే జైకొట్టింది. శుక్రవారం మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన వర్సిటీ వీసీల సమావేశాన్ని నిర్వహించారు. దోస్త్‌ను కొనసాగించాలని నిర్ణయించగా, బకెట్ సిస్టంను రద్దుచేయాలని పలువురు వీసీలు అభిప్రాయపడ్డారు. దీంతో ఈ విద్యాసంవత్సరం నుంచి బకెట్ సిస్టంను రద్దుచేయాలని సమావేశంలో నిర్ణయించారు.
పెరిగిన కోర్సుల గందరగోళం
డిగ్రీ కోర్సుల్లో 2021 నుంచి బకెట్ ఆఫ్ కోర్సెస్(బీవోసీ)ని అమలుచేస్తున్నారు. మొత్తం డిగ్రీ కోర్సులను ఏ, బీ, సీ, డీ బకెట్లుగా విభజించారు. ఈ విధానంలో బీఎస్సీ గణితం తీసుకున్న విద్యార్థి సైకాలజీ వంటి కోర్సులను తీసుకునే అవకాశముంది. ఈ విధానంతో గతంలో పదుల సంఖ్యలో ఉన్న డిగ్రీ కోర్సులు 505 అయ్యాయి. సబ్జెక్టు కాంబినేషన్లు పూర్తిగా మారిపోయాయి.
50 మార్కులకు డిగ్రీ ఎండ్ సెమిస్టర్ పరీక్షలు
డిగ్రీలో ఇక నుంచి నిరంతర మూల్యాంకనం (కంటిన్యూయస్ అసెస్మెంట్ ప్యాట్రన్) అమలుచేయాలని నిర్ణయించారు. డిగ్రీ ఎండ్ సెమిస్టర్ పరీక్షలను 50 మార్కులకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. బకెట్ సిస్టంను రద్దుచేసినా ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల కోసం రెండేండ్ల పాటు ఈ విధానం అమల్లో ఉంటుంది. 2025 26 విద్యాసంవత్సరం నుంచి కొత్తగా ప్రవేశాలు పొందేవారికి మాత్రం బకెట్ సిస్టం ఉండదు. ఇంటర్ ఫలితాలు రాగానే దోస్త్ నోటిఫికేషన్‌ను విడుదలచేస్తారు.