Kyama Mallesh | యాదాద్రి భువనగిరి : తనకు యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని, స్వామి వారి దయతో పార్లమెంట్ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తానని భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ అన్నారు. సోమవారం ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి క్యామ మల్లేష్ తమ కుటుంబ సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం క్యామ మల్లేష్ మాట్లాడుతూ నియోజవర్గ ప్రజల అండ, స్వామి వారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయన్నారు. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు పదేళ్ల బీఆర్ఎస్ పాలనను నేటికీ గుర్తు చేసుకుంటున్నారని, కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయన్నారు. ఎంపీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుస్తుందన్నారు.