శేరిలింగంపల్లి, జూలై 30: భూముల రక్షణకు గచ్చిబౌలిలోని బీటీఎన్జీవోల కార్యాలయంలో ఆగస్టు 1వ తేదీన టీజేఏసీ అధ్వర్యంలో భారీ సమావేశం నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణగౌడ్ తెలిపారు. భాగ్యనగర్ టీన్జీవోల నిరసన కార్యక్రమాలు బుధవారంతో 15వ రోజుకు చేరుకున్నాయి. రాష్ట్యవాప్తంగా వివిధ జిల్లాల నుంచి దాదాపు 200 మంది ఉద్యోగులు, పెన్షనర్లు గచ్చిబౌలిలోని భాగ్యనగర్ టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. తమకు న్యాయం చేయాలంటూ కండ్లకు నల్ల గంతలు కట్టుకొని చేతిలో ప్లకార్డులు ప్రదర్శించి వినూత్నంగా నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా బీటీఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులకు న్యాయం చేసేదాకా పోరాటం కొనసాగుతుందని చెప్పారు. శాంతియుత మార్గంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూనే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇందులో భాగంగా శుక్రవారం టీజేఏసీ నాయకులతో నిర్వహించే సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నట్టు తెలిపారు. భాగ్యనగర్ టీఎన్జీవోస్ మ్యూచివల్ ఎయిడెడ్ కో-ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ ఉపాధ్యక్షుడు రాజేశ్వర్‌రావు, సెక్రటరీ మల్లారెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, డైరెక్టర్లు ప్రభాకర్‌రెడ్డి, రషీదా బేగం, సంధ్య, నర్సింహారాజు, ఏక్నాథ్గౌడ్, నాయక్, దామోదర్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.