శేరిలింగంపల్లి, జూలై 25: గోపన్‌పల్లిలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్వర్యంలో కొనసాగుతున్న బీటీఎన్జీవోల ఆందోళన శుక్రవారం 10వ రోజుకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది ఉద్యోగులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. బీటీఎన్జీవోలకు కేటాయించిన స్థలాల ఆక్రమణను వ్యతిరేకిస్తూ ఆ సంఘం కార్యాలయ అవరణలో నిత్యం నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. తమకు న్యాయం జరిగేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ శుక్రవారం పలువురు ఉద్యోగులు ప్లకార్డులతో ఆందోళన నిర్వహించారు. ప్రైవేటు వ్యక్తులు తమ స్థలంలో చేపడుతున్న పనులను వెంటనే నిలిపివేసేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఈ ఆందోళనలో పాల్గొన్నారు. మద్దతుదారులు సంఘీభావం తెలిపారు.
కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్లి.. వెనక్కి
గోపన్‌పల్లిలోని భాగ్యనగర్ టీఎన్జీవోల స్థలాల ఆక్రమణపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లేందు శుక్రవారం మధ్యాహ్నం ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు వెళ్లారు. అయితే, మధ్యలోనే వెనుదిరిగారు. శుక్రవారం మధ్యాహ్నం తనను కలిసేందుకు కలెక్టర్ సమయం ఇచ్చినప్పటికీ కలెక్టర్ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. అపాయింట్మెంట్ శనివారం సాయంత్రానికి మారడంతో చేసేది లేక వారు వెనుదిరిగారు.