శేరిలింగంపల్లి, ఆగస్టు 2: తమ సమస్యల పరిష్కారం కోసం గాంధీయమార్గంలో నిరసన తెలుపుతున్నా, ప్రభుత్వం స్పందికపోవడం బాధాకరమని భాగ్యనగర్ టీఎన్జీవోలు ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న భాగ్యనగర్ టీఎన్జీవోలు ఆందోళన శనివారం 18వ రోజుకు చేరుకుంది. గచ్చిబౌలిలోని భాగ్యనగర్ టీఎన్జీవోల కార్యాలయం వద్ద పలువురు ఉద్యోగులు, పెన్షనర్లు రోజుకో తీరులో వినూత్నంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా శనివారం ఉద్యోగులు చేతులు జోడించి దండాలు పెడుతూ నిరసన తెలిపారు.
బీటీఎన్జీవో కార్యాలయం నుంచి కాలనీపార్క్ రహదారిపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. గోపన్పల్లి స్థలాల భూఆక్రమణపై న్యాయం చేయాలని నినదించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ భూములు తమకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీటీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ఆందోళనలో భాగ్యనగర్ టీఎన్జీవోస్ మ్యూచివల్ ఏయిడెడ్ కో-ఆపరేటీవ్ హౌజింగ్ సొసైటీ ఉపాధ్యక్షుడు రాజేశ్వర్రావు, సెక్రటరీ మల్లారెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, డైరక్టర్లు ప్రభాకర్ రెడ్డి, రషీదా బేగం, సంధ్య, నర్సింహారాజు, ఎక్నాథ్గౌడ్, నాయక్, దామోదర్ పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.