నిజామాబాద్ వినాయక్‌నగర్/ కోరుట్ల, సెప్టెంబర్ 17 : జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఎస్కోనిగుట్ట కాలనీకి చెందిన చిత్తరి హరిబాబు(28) నిజామాబాద్ జిల్లా కేంద్రం లో దారుణహత్యకు గురయ్యాడు. కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన గంధం వైష్ణవి అనే యూట్యూబర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న హరిబాబుని పట్టపగలే అందరూ చూస్తుండగా హత్యచేసిన దుండగుడు కారులో పరారయ్యారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యూట్యూబర్ వైష్టవిని ప్రేమ వివాహం చేసుకున్న హరిబాబు మార్చి 17న గర్భిణిగా ఉన్న ఆమెను హత్య చేసిన విషయం విదితమే. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న హరిబాబు నెలరోజుల క్రితం బెయిల్‌పై వచ్చాడు. తన అన్నతో కలిసి కొద్ది రోజులు వినాయక విగ్రహాల తయారీ పరిశ్రమలో పనిచేశాడు.
కొద్ది రోజుల క్రితం కోరుట్లలోని తన ఇంటిని ఖాళీ చేసి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉంటున్న తన తల్లి వద్దకు వెళ్లాడు. రాజరాజేంద్ర చౌరస్తాలో తన తల్లితో కలిసి మక్క కంకులు, కూరగాయలు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలోనే గురువారం కంకులు విక్రయిస్తుండగా కారులో వచ్చిన ఓ దుండగుడు కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో హరిబాబు మెడ, తలపై విచక్షణా రహితంగా దాడిచేసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ హరిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటన చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హత్యకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. వైష్ణవి హత్యకు గురైన ఆరు నెలలకు హరిబాబు హత్యకు గురి కావడం కలకలం రేపుతున్నది. ఏసీపీ ప్రకాశ్ యాదవ్, రెండో టౌన్ ఎస్సై యాదగిరి గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా హరిబాబును హత్య చేసిన నిందితుడు కోరుట్ల పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు సమాచారం.