కీసర, సెప్టెంబర్ 17: మేడ్చల్ జిల్లా కీసర పోలీసుస్టేషన్ సీఐ, ఎస్ఐలను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరిద్దరు అవినీతి కేసులో అరెస్టయినట్టు తెలియడంతో కొందరు స్థానికులు పోలీస్‌స్టేషన్ ముందు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. రేషన్ బియ్యం కేసులో నిందితుడిగా ఉన్న సయ్యద్ ఇర్షాద్‌ను వారం రోజులుగా సీఐ ఆర్కేపల్లి ఆంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్‌రెడ్డి వేధింపులకు గురిచేశారు.
బెయిల్ ఇచ్చేందుకు రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. ముందుగా రూ.5 లక్షలు ఇవ్వాలని అన్నారు. బుధవారం అర్ధరాత్రి రాంపల్లి చెరువు వద్ద గణేశ్ నిమజ్జనం దగ్గర బందోబస్తు విధుల్లో ఉన్న ఎస్ఐ జ్ఞానేందర్‌రెడ్డికి రూ.5 లక్షలు ఇవ్వాలని చెప్పారు. దీంతో రాంపల్లి చెరువు వద్ద మాటువేసిన ఏసీబీ అధికారులు ఎస్ఐ జ్ఞానేందర్‌రెడ్డి కారులో రూ.5 లక్షలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులను తప్పించుకోవడానికి, కెమికల్ టెస్టు లు చేయించుకోవడానికి ఎస్ఐ తొలుత నిరాకరించాడు. ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐని కూడా అదుపులోకి తీసుకొని కీసర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
సీఐ, ఎస్సైల ఇండ్లలో ఏసీబీ సోదాలు
ఏసీబీ వలలో చిక్కిన సీఐ ఆర్కేపల్లి ఆంజనేయులు, ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డి ఇండ్లలో కూడా ఏసీబీ అధికారులు గురువారం సోదా లు చేశారు. హబ్సీగూడలోని సీఐ ఇంట్లో రూ.2 లక్షల నగదు, విలువైన పత్రాలు, బో డుప్పల్లో ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డి ఇంట్లో రూ.10 లక్షల నగదు, భూములకు సంబంధించిన పత్రాలు దొరికినట్టు తెలిసింది. సీఐ ఆంజనేయులు కీసరకు వచ్చిన తరువాత భూములకు సంబంధించిన వ్యవహారాల్లో కోట్లాది రూపాయలు సంపాదించాడని రాంపల్లి, కరీంగూడకు చెందిన కొంతమంది నేతలు ఆరోపించారు.