సికింద్రాబాద్, సెప్టెంబర్ 17: కుమారుడి ఆర్థిక లావాదేవి వివాదంలో తండ్రిని హత్య చేసిన నిందితుడిని చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సీతాఫల్‌మండికి చెందిన సుమన్‌కు భోలక్‌పూర్‌కు చెందిన మహ్మద్ నిజాముద్దిన్ (36)తో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో షేర్ మార్కెట్ ట్రేడింగ్, పెట్టుబడుల పేరుతో సుమన్ దాదాపు రూ. 50 లక్షల నుంచి 60 లక్షల వరకు నిజాముద్దిన్ వద్ద తీసుకున్నాడు. షేర్ మార్కెట్లో నష్టపోవడంతో అనుకున్న విధంగా సమయానికి తీసుకున్న డబ్బులు తిరిగివ్వకపోవడమే కాకుండా, నిజాముద్దిన్కు దొరకకుండా సుమన్ నవంబర్ (2013) నుంచి ఇంట్లో నుంచి పరారయ్యాడు. తన డబ్బులు తిరిగి రాకపోవడంతో పాటు సుమన్ ఆచూకి తెలియకపోవడంతో నిజాముద్దిన్ సుమన్ కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. సుమన్ తండ్రి శ్రీనివాస్‌ను లక్ష్యంగా చేసుకున్నాడు.
ఈ విషయంలోనే కోర్టులో కేసు నడుస్తున్నట్లు తెలిపారు. ఈనెల 15న శ్రీనివాస్ రాత్రి 7:30 గంటల సమయంలో చిలకలగూడలోని వైన్‌షాపులో మద్యం కొనుక్కుని తిరిగి వస్తుండగా మైలార్‌గడ్డ, నామాలగుండు మార్గంలో ఉన్న ఎవర్గ్రీన్ టెంట్ హౌజ్ సమపంలో శ్రీనివాస్ ఉండగా అక్కడికి చేరుకున్న నిజాముద్దిన్ ఒక్కసారిగా కత్తితో అతని కడుపులో రెండు పర్యాయాలు బలంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిపోయిన శ్రీనివాస్‌ను స్థానికులు వెంటనే టీజీఎన్ఆర్టీసీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కొసం అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు మహ్మద్ నిజాముద్దిన్ను 16 న అరెస్ట్ చేశారు.