హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్త సమ్మె ఈనెల 12న జరుగుతుండగా ఆటో సంఘాల జేఏసీ, క్యాబ్, లారీల సంఘాలతోపాటు అన్ని రవాణా సం ఘాలు బంద్‌లో పాల్గొనాలని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య పిలుపునిచ్చారు. 12న జరిగే సమ్మెలో తామంతా పాల్గొంటున్నట్టు తెలంగాణ రవాణాశాఖ జాయింట్ కమిషనర్ సీహెచ్ శివలింగయ్యకు సోమవారం బీఆర్టీయూ నేతలతో కలిసి సమ్మె నోటీసు ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్రం కొత్తగా తెచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెకు అన్నివర్గాల కార్మికులు మద్దతు తెలుపాలని కోరారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు తెలంగాణ ఆటో మోటర్, అన్ని రవాణా రంగాల జేఏసీ సంసిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సారథి పోర్టల్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెకు ప్రజలు పూర్తిగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు బీ వెంకటేశం, వీ ప్రవీణ్, సలీంభాయ్, కోటిరెడ్డి, రాజిరెడ్డి, సలావుద్దీన్, నాగేశ్, రమేశ్, కే రామాంజనేయులు, పరశరాములు, నిరంజన్, రామకృష్ణ, దయానంద్, సదానందం తదితరులు పాల్గొన్నారు.