హైదరాబాద్, మార్చి 1(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనలో 8 మంది కార్మికుల ప్రాణాలు గాల్లో కలిశాయని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో శనివారం ఆయన బీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ ఘటనకు సీఎం రేవంత్‌రెడ్డే బాధ్యత వహించాలని, బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ పాలనలో కార్మికవర్గాన్ని కడుపులో పెట్టి చూసుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చిన్నచూపు చూస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ నారాయణ మాట్లాడుతూ కార్మికులపై ముఖ్యమంత్రి మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి మారయ్య మాట్లాడుతూ కా ర్మికుల ప్రాణాలు కాపాడటంలో ప్ర భుత్వం విఫలమైందని ఆరోపించారు.