BRTU | బ్యాంక్ అకౌంట్ నుంచే నేరుగా ట్రాఫిక్ చలానా కట్ చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ) తీవ్రంగా ఖండించింది. వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో బ్యాంక్ అకౌంట్‌ను తప్పనిసరిగా జత చేయాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలు, వ్యక్తిగత స్వేచ్ఛకు విరుద్ధమైనదని బీఆర్టీయూ ఉపాధ్యక్షులు అత్తినమోని నాగేశ్ కుమార్ విమర్శించారు. ఇది ప్రజల హక్కులను హరించే ప్రమాదకర నిర్ణయమని పేర్కొన్నారు.
ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు చెట్టు చాటున, పుట్ట చాటున దాగి ఫోటోలు తీసి చలానాలు విధిస్తున్న పరిస్థితి ఉందని ఆయన అన్నారు. అలాంటి సందర్భాల్లో బ్యాంక్ అకౌంట్‌ను ఆటోమేటిక్‌గా లింక్ చేయడం అంటే ప్రజల ఖాతాల నుంచి నేరుగా డబ్బు కట్ చేసే నియంతృత్వ పోకడలకు నిదర్శనమని విమర్శించారు ఇది కేవలం ప్రభుత్వ ఖజానాను నింపుకోవడానికి తీసుకుంటున్న నిర్ణయమే తప్ప, పాలనలో సంస్కరణలు తీసుకురావాలన్న నిజమైన ఉద్దేశం కనిపించడం లేదని మండిపడ్డారు.
రోడ్లపై యూటర్న్లు శాస్త్రీయంగా లేవని.. కొన్నిచోట్ల కిలోమీటర్ల కొద్దీ తిరిగి యూటర్న్ తీసుకోవాల్సిన దుస్థితి ఉందని తెలిపారు. రోడ్లపై గుంతల కారణంగా ప్రతి సంవత్సరం వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారని.. అయినా ఈ సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని అన్నారు. నగరాల్లో షాపింగ్ మాల్స్‌కు సరైన పార్కింగ్ సదుపాయం లేకపోయినా అనుమతులు ఇస్తున్నారని ప్రస్తావించారు. ఆ మాల్స్ వద్ద రోడ్లపై పార్క్ చేసిన వాహనాలకు మాత్రం జరిమానాలు విధిస్తున్నారని.. ఇది పూర్తిగా ప్రజలపై భారం మోపే విధానమే అని మండిపడ్డారు.
కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ చేయాల్సిన పోలీసులు, ఒకవైపు ఫోటోలు తీస్తూ చలానాలు వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. అటువంటి పరిస్థితుల్లో ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పాలనలో సంస్కరణలు తీసుకురావాల్సిన ప్రభుత్వం, ప్రజల నుంచే వసూలు చేస్తామని చెప్పడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయాలు ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతున్నాయన్నారు. ముఖ్యంగా మధ్యతరగతి, పేద కుటుంబాలను మరింతగా పీడించే ప్రయత్నంగా ఇది కనిపిస్తోందని తెలిపారు.
చట్టం ధనవంతులకు ఒకటి, పేదలకు ఇంకొకటా? అప్పుడు పేదోళ్లు పేదలే, ఇప్పుడూ పేదలే కాదా? అని నాగేశ్‌కుమార్ మండిపడ్డారు. ప్రభుత్వం నిజంగా బాధ్యత వహించాలనుకుంటే, సీఎం, మంత్రుల బ్యాంక్ అకౌంట్లను కూడా ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా, రోడ్లు వేయకపోయినా, పార్కింగ్ సదుపాయాలు కల్పించకపోయినా, జీబ్రా క్రాసింగ్‌లు లేకపోయినా, ట్రాఫిక్ పోలీసులు ఫోటోగ్రఫీ తప్ప మరో పని చేయకపోయినా.. అప్పుడు ప్రజలు ఫైన్ కట్టి మీ అకౌంట్ల నుంచి డబ్బు తీసుకోవాలా అని ప్రశ్నించారు.