హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 21(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ వైఖరికి నిరసనగా, ఆటోకార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిసెంబర్ 7న రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు బంద్ చేపట్టాలని బీఆర్టీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య పిలుపునిచ్చారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం తెలంగాణ ఆటోజేఏసీ రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, ఏఐటీయూసీ ట్రాన్స్పోర్ట్ రంగం అధ్యక్షుడు సీవీబోసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేముల మారయ్య మాట్లాడుతూ మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం తీసుకొచ్చి రాష్ట్రవ్యాప్తంగా ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర సంబురాలు చేసుకుంటున్నదని మండిపడ్డారు. ఆటోకార్మికులకు ప్రభుత్వం నెలకు రూ.15వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశం, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్, ఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్, హైదరాబాద్ ఓనర్ అసోసియేషన్స్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు సలీం, టీఏడీయూ ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి పాల్గొన్నారు.