హైదరాబాద్ జూలై 4 (నమస్తే తెలంగాణ)/జిన్నారం: హైదరాబాద్లోని బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియాలోని ఐటీసీపై గులాబీ జెండా ఎగిరింది. అధికార పార్టీ కుట్రలు, కుతంత్రాలు, ఎత్తుగడలను కార్మికలోకం తిప్పికొట్టింది. ఓటుతో కాంగ్రెస్ పన్నాగాలను చిత్తు చేసింది. నిరంతర కరెంట్ ఇచ్చి కార్మికుల సంక్షేమానికి పరితపించిన కేసీఆర్కు జైకొట్టింది. శుక్రవారం జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీపై బీఆర్ఎస్ అనుబంధ యూనియన్ బీఆర్టీయూ ఘన విజయం సాధించింది.
బీఆర్టీయూ అభ్యర్థి రాంబాబుయాదవ్ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మాజీ మంత్రి ఐఎన్టీయూసీ మాజీ ప్రెసిడెంట్ జీ సంజీవరెడ్డిని మట్టికరిపించారు. ఈ సందర్భంగా రాంబాబు యాదవ్ మాట్లాడుతూ తనను గెలిపించిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ శివశంకర్, రాష్ట్ర కార్యదర్శి రవికుమార్, ఐటీసీ యూనియన్ ప్రధాన కార్యదర్శి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.