హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డికి కార్పొరేట్ విద్యపై ఉన్న సోయి గురుకులాల మీద లేదని, గురుకుల విద్యార్థులకు సరిగా అన్నం పెట్టలేని దుస్థితిలో ఉన్నాడని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగబాలు మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో భోజనం సరిగా పెట్టడం లేదని విద్యార్థులు హైవేపై బైఠాయించినా కాంగ్రెస్ సర్కార్‌కు చీమకుట్టినట్టుగా కూడా లేదని విమర్శించారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో కొంతమంది విద్యార్థులు మరణించారని, మరికొంత మంది కలుషిత ఆహారం తిని దవాఖానల పాలయ్యారని అయినా సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
గురుకుల విద్యార్థులకు ఈ ఏడాదిలో ఇప్పటికీ యూనిఫారాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నదని ఎద్దేవాచేశారు. ప్రజాధనంతో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ తెచ్చుకున్న రేవంత్.. గురుకులాల్లో చదువుకునే పేద విద్యార్థులకు కనీసం అన్నం పెట్టని దౌర్భాగ్యస్థితిలో ఉండటం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతోనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం గురుకులాల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధవహించాలని డిమాండ్‌చేశారు.