హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను నిర్లక్ష్యం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నించటం దారుణమైన చర్య అని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు అన్నారు. వెయ్యికి పైగా గురుకులాలను నెలకొల్పి దేశంలోనే ఆదర్శవంతమైన విద్యావ్యవస్థకు కేసీఆర్ బాటలు వేస్తే కాంగ్రెస్ సర్కారు వాటిని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు.
కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకులాలని అద్భుతంగా తీర్చిదిద్దితే, సీఎం రేవంత్రెడ్డి గురుకులాలు సామాజిక రుగ్మతలకు కారణమవుతున్నాయని భావించి, ఆ వ్యవస్థనే నిర్వీర్యం చేసేలా వ్యాఖ్యానించడం సమంజసం కాదని పేర్కొన్నారు. గురుకులాలలో చదువుకునే విద్యార్థులు విషాహారంతో చనిపోతున్నా రేవంత్రెడ్డి సర్కారు పట్టించుకోవటం లేదని ఆయన విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు చదువుకొని ఎక్కడ బాగుపడతారోనని సీఎం భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. గురుకులాలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైనా ఉన్నదని తెలిపారు. మహత్తర ఆశయంతో నెలకొల్పిన గురుకుల వ్యవస్థను సీఎం రేవంత్రెడ్డి బలహీనపరిచే చర్యని మానుకోవాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు.