హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే యాజమాన్యాలకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమం చేపట్టనున్నట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 29న ‘హాలో విద్యార్థి- చలో కలెక్టరేట్’ కార్యక్రమం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో ‘చలో కలెక్టరేట్’ పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. గడిచిన 22 నెలలుగా రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడమే లేదని మండిపడ్డారు. రీయింబర్స్మెంట్ బకాయిలు అందక విద్యార్థులు, అధ్యాపకులు తీవ్ర ఇక్కట్టు పాలువుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు నష్టాలతో అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అప్పులతో కాలేజీలను నడుపుతున్నారని తెలిపారు. అక్కడ పనిచేసే సిబ్బందికి సరిగా జీతాలు అందడం లేదని చెప్పారు. ఆయా సిబ్బంది కుటుంబాలు ఆర్థికంగా చాలా కష్టాలను అనుభవిస్తున్నారని తెలిపారు.
విద్యా సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థులకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, ఫీజు రీయంబర్స్మెంట్ చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీ యాజమాన్యాలు భీష్మించుకుని ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఫీజు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకెళ్లాలని మెలిక పెడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో ఒరిజినల్ సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల కుటుంబాలు నగలు, ఆస్తులు తాకట్టు పెడుతున్నారని తెలిపారు. విద్యాశాఖ బాధ్యతలను స్వయంగా చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పట్టించుకోకపోవడంతో ప్రైవేటు కాలేజీల వ్యవస్థ కుప్పకూలిపోతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కాలేజీలు బంద్ పాటిస్తామని యాజమాన్యాలు బెదరిస్తే.. రూ.600 కోట్లు దసరాకు ఇస్తామన్న సర్కారు.. దీపావళి వెళ్లిపోయినా రూపాయి కూడా విడుదల చేయలేదని దుయ్యబట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో సీఎం రేవంత్రెడ్డి చెలగాటమాడుతున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు స్వామియాదవ్, యాదవ్క్రాంతి, శ్రీనునాయక్, రెహ్మ న్ తదితరులు పాల్గొన్నారు.