హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర నిరుద్యోగులపై లేదని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు స్వామి యాదవ్ ఆరోపించారు. ఉద్యోగాల కోసం టీజీపీఎస్సీ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపిన నిరుద్యోగులను వందలమంది పోలీసులతో బలవంతంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్టు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
గ్రూప్-1 మెయిన్స్‌లో 1:100 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రూప్ 2, 3 పోస్టులు భర్తీ చేయాలని, మెగా డీఎస్సీ ప్రకటించాలని, డీఎస్సీ పరీక్షలు మూడు నెలలు వాయిదా వేయాలని డిమాండ్‌చేశారు. రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న ఉద్యోగార్థులను పట్టించుకోకుండా సీఎం రేవంత్‌రెడ్డి స్వార్థ రాజకీయ ప్రయోజనాలనే చూసుకుంటున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో నిరుద్యోగులను వాడుకొని అధికారంలోకి వచ్చి, ఇప్పుడు వారినే నడి సముద్రంలో వదిలేశారని, ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే బీఆర్ఎస్ పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు.