వికారాబాద్, జూలై 27: కొన్ని మీడియా సంస్థలు, కొన్ని యూట్యూబ్ చానళ్లు బీఆర్ఎస్ నేతలపై అసత్య ప్రచారాన్ని ఆపకుంటే మళ్లీ దాడులు జరుగుతాయని ఓయూ విద్యార్థి నేత, బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య హెచ్చరించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా కేటీఆర్, హరీశ్‌రావు ఇతర నేతలపై దుష్ప్రచారం తగదని హితవు పలికారు. చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన ఆయనకు స్థానికంగా విద్యార్థి నేతలు ఘనస్వాగతం పలికారు. బీఆర్ఎస్ నేతలపై అసత్య ప్రచారాన్ని నిరసిస్తూ మహాన్యూస్ ఎదుట చేపట్టిన ఆందోళన సందర్భంగా జంగయ్య అక్రమంగా అరెస్టు అయి 22 రోజుల తర్వాత చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా జంగయ్య మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి కొన్ని మీడియా చానళ్లను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్పై అసత్య ప్రచారం చేయిస్తే మళ్లీ దాడులు చేసేందుకు వెనుకడుగు వేయమని స్పష్టంచేశారు. ఎన్ని కేసులు పెట్టినా, జైళ్లలో నిర్బంధించినా బీఆర్ఎస్వీ వెనుకడుగు వేయదని తేల్చిచెప్పారు.