Gellu Srinivas Yadav | సీఎం రేవంత్ రెడ్డికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఇంజనీరింగ్ చదువును ఉచితం చేస్తామని, ప్రతి విద్యార్థికి ఐదు లక్షలు ఇస్తామని, ప్రభుత్వమే ఫీజులు భరిస్తుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ విద్యా శాఖను తన వద్దే ఉంచుకున్న రేవంత్ రెడ్డి ఫీజుల నియంత్రణపై ఇప్పటివరకు ఎలాంటి సమీక్ష చేయలేదని అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చే రెండేండ్ల వరకు ఇంజినీరింగ్ కాలేజీల్లో ట్యూషన్ ఫీజులు పెంచవద్దని అన్నారు. ఈ మేరకు తీసుకుంటున్న చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలకు కొనుగోలు శక్తి పడిపోయిందని గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇది ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదని ఆయన మండిపడ్డారు. గత ఎన్నికల ముందు రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ సీఎం రేవంత్‌రెడ్డి పూర్తిగా విస్మరించాడని ఆగ్రహించారు. తాము అధికారంలోకి వస్తే.. ఇంజినీరింగ్ విద్యను ఉచితం చేస్తామని, ప్రతి విద్యార్థికి రూ.5 లక్షల ప్రభుత్వం ఇస్తుందని, ప్రభుత్వమే ట్యూషన్ ఫీజులు భరిస్తుందంటూ ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలైనా.. విద్యా శాఖ మంత్రిగా.. సీఎం రేవంత్‌రెడ్డి కొనసాగుతున్నా.. ఇంత వరకు ఆ శాఖ బాగోగులపైనా.. ట్యూషన్ ఫీజుల నియంత్రణపైనా ఇప్పటి వరకు ఎలాంటి సమీక్ష సమావేశం నిర్వహించలేదని మండిపడ్డారు.
నాడు ఎన్నికల ముందు ఇంజనీరింగ్ చదువును ఉచితం చేస్తామని, ప్రతి విద్యార్థికి ఐదు లక్షలు ఇస్తామని, ప్రభుత్వమే ఫీజులు భరిస్తుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు.
కానీ విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న రేవంత్ రెడ్డి ఫీజుల నియంత్రణపై ఇప్పటివరకు సమీక్ష చేయలేదు.
రేవంత్ రెడ్డికి అందాల పోటీలపై… pic.twitter.com/ZCH0Trjlvt
— BRS Party (@BRSparty) May 16, 2025
రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలలో విచ్చలవిడిగా ట్యూషన్ ఫీజులు పెంచుతున్నారని మండిపడ్డారు. రూ.1.60 లక్షల వరకు ఉన్న ట్యూషన్ ఫీజును ఏకంగా.. రూ.2.80 లక్షల వరకు పెంచారని, ఇంత పెద్ద మొత్తంలో ఫీజులను పెంచితే పేద ప్రజలు ఎలా భరిస్తారని ప్రశ్నించారు. విద్యా శాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఫీజుల నియంత్రణ ఎందుకు చేయడం లేదో అర్థం కావడం లేదని అన్నారు. ట్యూషన్ ఫీజుల పెంపు కోసం ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు సమర్పించిన నివేదికలపై అనేక అనుమానాలు ఉన్నాయని, ఆ నివేదికల నిగ్గు తేల్చాలంటే థర్డ్‌పార్టీతో విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. యాజమాన్యాలకు తలొగ్గకుండా ప్రభుత్వం ఫీజులు నియంత్రించాలని అన్నారు.