హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): ఓయూలో విద్యార్థులు నిరసనలు, ధర్నాలు చేయొద్దంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్వీ భగ్గుమంది. ప్రభు త్వం విడుదల చేసిన ఉత్తర్వులు వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు సోమవారం ఉదయం అసెంబ్లీని ముట్టడించారు. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి డౌన్..డౌన్.. అంటూ బీఆర్ఎస్వీ నాయకులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. ఈక్రమంలో పోలీసులు బీఆర్ఎస్వీ నాయకులు అసెంబ్లీ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకులు మాట్లాడుతూ.. సామాజిక ప్రజా ఉద్యమాలకు వేదికైన ఓయూలో విద్యార్థులు నిరసన కార్యక్రమాలు రద్దు చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి దొడ్డిదారిలో రావొచ్చు.. కానీ ఓయూ విద్యార్థులు విద్య, నిరుద్యోగ సమస్యల మీద ప్రశ్నిస్తే తప్పు ఎలా అవుతుందని అని నిలదీశారు. ఎంతో ముఖ్యమైన విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని.. యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని రద్దు చేయాలనే కుట్రలు మానుకోవాలని డిమాండ్ చేశారు. వంద సంవత్సరాల వర్సిటీ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా నిర్బంధాలను విధించలేదని ధ్వజమెత్తారు. సమైక్య రాష్ట్రంలో కూడా సీఎం రేవంత్‌రెడ్డిలాగా ఎవరు ఇలా నిర్బంధాలను విధించలేదని మండిపడ్డారు. ములి, తెలంగాణ, సామాజిక ఉద్యమాలకు ప్రజల తరుఫున మాట్లాడే గొంతుకలు ఓయూ విద్యార్థులని అన్నారు. అలాంటి వారి స్వేచ్ఛ హరించే విధంగా ఉన్న సర్క్యూలర్లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగబాలు, నాయకులు గజరాజు చందు, చటరీ దశరథ్, జంగయ్య, రమన్, యశ్వంత్ గుప్తా, అవినాశ్ బాలెంల, నాగేందర్, రాహుల్, శ్రీకాంత్ ముదిరాజ్, అద్వైత్‌రెడ్డి, రాకేశ్, సాయి, ప్రభాకర్, గణేశ్, రాహుల్, రెహమత్ తదితరులను పోలీసులు అరెస్టు చేసి వ్యాన్ ఎక్కించి అక్కడ నుంచి తరలించారు.