హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్స్‌లో శనివారం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) రాష్ట్ర సదస్సును నిర్వహించనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ సదస్సులో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కీలకోపన్యాసం చేస్తారని చెప్పారు.
హైదరాబాద్ తెలంగాణభవన్‌లో గురువారం ఆయన బీఆర్ఎస్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రారంభ సదస్సులో హరీశ్‌రావు, మధ్యాహ్నం సెషన్లో జగదీశ్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్ హాజరవుతారని తెలిపారు. ముగింపు సందర్భంగా కేటీఆర్ కీలకోపన్యాసం చేస్తారని తెలిపారు. సదస్సులో ప్రతినిధులతో బనకచర్లపైనే ప్రధానంగా చర్చిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే 50 బీఆర్ఎస్వీ బృందాలు యూనివర్సిటీలు, వివిధ కాలేజీల్లో విద్యార్థులతో సమావేశాలు నిర్వహించి సదస్సుపై అవగాహన కల్పిస్తున్నాయని చెప్పారు.
5 లక్షల కరపత్రాలు ముద్రించామని, విద్యార్థులను కలిసి బనకచర్లతో తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని వివరిస్తున్నామని తెలిపారు. శుక్రవారంతో అవగాహన సదస్సులు ముగుస్తాయని శనివారమే రాష్ట్ర సదస్సు ఉంటుందని తెలిపారు. ఇక్కడ శిక్షణ పొందిన నేతలు ఆ తర్వాత జిల్లాల్లో సదస్సులు నిర్వహించి బనకచర్లతో తెలంగాణకు జరిగే నష్టాన్ని వివరిస్తారని తెలిపారు. చంద్రబాబు, మోదీ, రేవంత్‌రెడ్డి కలిసి తెలంగాణ నీటి వనరులను కొల్లగొడుతున్న తీరును వివరిస్తామని వెల్లడించారు.
తెలంగాణకు అన్యాయం జరిగితే సహించబోమని, మరో పోరాటానికి బీఆర్ఎస్వీ సన్నద్ధమవుతుందని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ హెచ్చరించారు. గోదావరి నదీజలాలపై ఏపీ సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్టును కేంద్ర సంస్థలు తిరసరించాయని చెప్పారు. తన గురువుకు తెలంగాణ హక్కులను ధారాదత్తం చేసేపనిలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారని మండిపడ్డారు. రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తే కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. ఎంత అణిచివేసే ప్రయత్న చేసినా బీఆర్ఎస్ అధినాయకత్వం భయపడబోదని చెప్పారు.
ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణగా తెలంగాణ ప్రయోజనాలను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తాకట్టు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. రోజుకో డైవర్షన్ సీమ్‌తో తన పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో కుక్కిన పేనుల్లా ఉన్న మహారాష్ట్ర, ఏపీ నేతలు ఇప్పుడు రెచ్చిపోతున్నారని విమర్శించారు. 14 గ్రామాలపై మహారాష్ట్ర, బనకచర్ల ద్వారా తెలంగాణ నీటివాటాపై ఏపీ కన్నేసి పావులు కదుపుతున్నాయని మండిపడ్డారు. పులి లాంటి కేసీఆర్‌ను ఓడించి, జిత్తులమారి నక్కను గెలిపించడం వల్ల తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం వాటిల్లుతున్నదని విమర్శించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు చిరుమళ్ల రాకేశ్‌కుమార్, ఆంజనేయగౌడ్, నాయకులు ధర్మేందర్‌రెడ్డి, తుంగబాలు, కడారి స్వామియాదవ్, కృష్ణ పాల్గొన్నారు.