చిక్కడపల్లి, జూన్ 10: విద్యార్థుల డిమాండ్ మేరకు తాము బస్సు సర్వీసులను పెంచమంటే, ప్రభుత్వం మాత్రం బస్‌పాస్ చార్జీలను పెంచి విద్యార్థులపై పెనుభారం మోపిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మండిపడ్డారు. పెంచిన చార్జీలను తగ్గించకుంటే ప్రభుత్వంపై పోరాటం తప్పదని హెచ్చరించారు. ఆర్టీసీ పెంచిన బస్‌పాస్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని బస్‌భవన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్‌తోపాటు పలువురు బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడారు. విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం బస్‌పాస్ చార్జీలను పెంచి పేద విద్యార్థులను చదువులకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.
ఉన్న బస్‌పాస్ చార్జీలపై 20% అదనంగా పెంచి దోచుకోవాలనుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. తల్లులకు ఉచితమని పిల్లల నుంచి అధిక చార్జీలు వసూలు చేయడమేమిటని ప్రశ్నించారు. పెంచిన బస్‌పాస్ చార్జీలను వెంటనే తగ్గించాలని, లేకుంటే బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి స్వామియాదవ్, నాయకులు పడాల సతీశ్, జంగయ్య, కాటం శివ, రాజేశ్‌నాయక్, నర్సింగ్, మహిపాల్, శ్రీకాంత్ ముదిరాజ్, నాగేంద్ర రావు, అవినాశ్, రాహుల్, అద్వైత్‌రెడ్డి, ప్రశాంత్, కిరణ్, విశాల్, నితీశ్, రెహమాత్, సాయితేజరావు, పవన్ తదితరులు పాల్గొన్నారు.
బస్‌పాస్ చార్జీల పెంపుతో విద్యార్థులపై ఏటా రూ.650 కోట్ల అదనపు భారం పడుతుందని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఆందోళన వ్యక్తంచేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యార్థుల బస్‌పాస్ చార్జీల పెంపుతో విద్యార్థులంతా అయోమయంలో పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. ఒకవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అం టూనే.. మరోవైపు వారి కుటుంబ సభ్యులపై అధిక చార్జీలు మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సర్కార్ ఖాళీ ఖజానా నింపుకోవడానికి రాష్ట్రంలో విద్యార్థులే దొరికారా? అని నిలదీశారు. బస్‌పాస్ చార్జీల పెంపుతో ఆదాయాన్ని సమకూర్చుకుని, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారా? అని ప్రశ్నించారు. పెంచిన చార్జీలు వెంటనే ఉపసంహారించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు కడారి స్వామియాదవ్, నాయకులు నర్సింగ్, జంగయ్య, నితీశ్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : విద్యార్థుల బస్‌పాస్ చార్జీలను పెంచుతూ ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. తెలంగాణలోని 10 లక్షలకుపైగా పేద, మధ్యతరగతి, గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువుకోవడానికి ఆర్టీసీ బస్సుల ద్వారా పట్టణాలకు వెళ్తుంటారని.. ఈ చార్జీల(20 శాతంపైగా) పెంపు ద్వారా వారిపై పెనుభారం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
ఆర్టీసీ యాజమాన్యం నెలకు రూ.400 ఉన్న బస్‌పాస్ చార్జీని రూ.600కు, 3నెలల ప్యాకేజీని రూ.1200 నుంచి రూ.1800కు పెంచుతూ పేద, మధ్యతరగతి విద్యార్థులపై ఆర్థిక భారం మోపిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ.. ఇప్పుడు బస్‌పాస్ చార్జీల పెంపు సరికాదని పేర్కొన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా బస్‌పాస్ చార్జీలను పెంచామని ప్రభుత్వం అంటుందని, విద్యార్థుల సాలర్షిప్లనూ పెంచాలని డిమాండ్ చేశారు. విద్యార్థులందరికీ ఉచిత బస్‌పాస్‌లు ఇవ్వాలని, పెంచిన బస్‌పాస్ చార్జీల నిర్ణయాన్ని వెనకి తీసుకోవాలని మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు.