నాగర్ కర్నూల్ : కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రులు గ్రూప్-1 పోస్టులను (Group-1 posts) అమ్ముకున్నారని ఆరోపిస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో శనివారం బీఆర్ఎస్వీ (BRSV Dharna) విద్యార్థులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
అర్హత లేని వారికి పోస్టులు ఇచ్చారని, వెంటనే రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్వగృహం నుంచి నాయకులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. రూ.3 కోట్లు కొట్టు.. గ్రూప్-1 పట్టు అంటూ నినాదాలు చేశారు. అర్హత లేని వారికి కూడా గ్రూప్ వన్ పోస్టును అమ్ముకున్నారని ఆరోపించారు.
ఉద్యోగాల పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ. 1700 కోట్ల భారీ స్కాంకు తెరలిపిందని విమర్శించారు. రెండు పరీక్ష హాల్లో పరీక్షలు రాసిన విద్యార్థులకు ఒకేలా మార్కులు రావడంపై కాంగ్రెస్ ప్రభుత్వం హస్తముందని, ఆ పోస్టులను ముందుగానే అమ్ముకున్నారనే విషయం బట్టబయలైందని విమర్శించారు. ఉద్యోగాల నియామకాల పేరుతో ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.