నిర్మల్ : ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్యపై కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాసర ట్రిపుల్ ఐటీ(Basara Triple IT) మెయిన్ గేట్ వద్ద బీఆర్ఎస్వీ నాయకులు(BRSV leaders) నిరసన చేపట్టారు. విద్యార్థుల సమస్యలను వెంటనే తీర్చాలని, వీటిపై అధికారులతో మాట్లాడాలని, లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేశారు. కాగా, నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో సోమవారం పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న స్వాతిప్రియ(18) హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్‌కు చెందిన రవీందర్-ఉజ్వల దంపతుల కూతురు స్వాతిప్రియ ట్రిపుల్ ఐటీలో పీయూసీ రెండో సంవత్సరం చదువుతుంది. హాస్టల్ గదిలో తొటి విద్యార్థులు టిఫిన్ చేయడానికి మెస్‌కు వెళ్లగా ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తోటి విద్యార్థులు టిఫిన్ చేసి రూంకు వచ్చాక స్వాతి ప్రియ ఉరి వేసుకుని ఉండడంతో విషయాన్ని సెక్యూరిటీ సిబ్బందికి తెలిపారు. అధికారులు సీఐ రాకేశ్, బాసర ఎస్సై గణేశ్‌లకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని కిందకి దించి అంబులెన్సులో భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.
స్వాతిప్రియ ఫోన్, అక్కడ లభ్యమైన సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకుని స్వాతిప్రియ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కాగా.. యూనివర్సిటీకి చేరుకోక ముందే మృతదేహాన్ని తరలించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు నా బిడ్డను ట్రిపుల్ఐటీ యాజమాన్యమే చంపేసిందని ఆవేదనను వ్యక్తం చేశారు. సీనియర్ విద్యార్థితోపాటు మరో తోటి విద్యార్థిని కూడా తనను వేధిస్తున్నారని నా కూతురు చెప్పిందని ఆఫీసులో ఫిర్యాదు చేయమన్నామని, ఫిర్యాదు చేసిన ట్రిపుల్ ఐటీ యాజమాన్యం పట్టించుకోక పోయి నా బిడ్డ చావుకు కారణమయ్యారని వాపోయారు.