హనుమకొండ, డిసెంబర్ 2 : గురుకులాల్లో ఏడాదిలో పదుల సంఖ్యలో విద్యార్థులు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ధ్వజమెత్తారు. హంటర్‌రోడ్డులోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో సమస్యలు తెలుసుకొనేందుకు వెళ్లిన బీఆర్ఎస్వీ నాయకులకు పోలీసులు అరెస్ట్ చేసి సుబేదారి స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న దాస్యం వినయ్‌భాస్కర్ విద్యార్థి సంఘం నాయకులతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం ఏసీపీతో మాట్లాడి, విద్యార్థి నాయకులను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు గురుకులాలను ఏర్పాటు చేశారని, కానీ, నేడు గురుకులాల్లో ఆహారం నాణ్యత లోపించిందని దుయ్యబట్టారు. కనీస వసతులు కరువై విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.