Padala Satish | దళిత, గిరిజన విద్యార్థుల జీవితాలతో ఈ దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పడాల సతీశ్ విమర్శించారు. దళిత గిరిజన విద్యార్థుల జీవితాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అగమ్యగోచరంగా తయారయ్యాయని అన్నారు.
పేద దళిత, గిరిజన విద్యార్థులు ప్రైవేటు విద్యాసంస్థలలో “బెస్ట్ అవైలబుల్ స్కీమ్” ద్వారా రాష్ట్రం మొత్తం 26 వేల మంది విద్యార్థులు, 230 పైచిలుకు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారని పడాల సతీశ్ తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు బుక్స్, యూనిఫామ్, భోజన వసతులు పాఠశాలల యాజమాన్యాలు కల్పిస్తున్నాయని అన్నారు.
కానీ పాఠశాలలకు చెల్లించాల్సిన ఫీజులను గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం చెల్లించడం లేదని తెలిపారు. దీంతో పాఠశాలలు నడపలేమని యాజమాన్యాలు చేతులెత్తేసే పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారని అన్నారు. బెస్ట్ అవైలబుల్ పాఠశాలలను మూసివేస్తే పేద దళిత, గిరిజన విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయావుతుందని అన్నారు. త్వరగా నిధులను విడుదల చేసి పాఠశాలలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు అధ్వానంగా తయారయ్యాయని పడాల సతీశ్ తెలిపారు. ఈ స్కీం కింద దళిత, గిరిజన విద్యార్థులకు సంబంధించిన బిల్లులు రూ.170 కోట్లు మాత్రమే, అయినప్పటికీ ఈ డబ్బులు ఇవ్వడానికి కూడా ప్రభుత్వానికి చేతగావడం లేదని విమర్శించారు.
తక్షణమే ప్రభుత్వం స్పందించి దళిత గిరిజన విద్యార్థులకు సంబంధించిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని విద్యార్థి విభాగం తరఫున డిమాండ్ చేశారు.