నమస్తే నెట్వర్క్, జూలై 22 : ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ ఎడారిగా మారుతుందని కేయూ బీఆర్ఎస్వీ ఇన్చార్జి జెట్టి రాజేందర్ ఆందోళన వ్యక్తంచేశారు. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ ఇంగ్లిష్, ఫార్మసీ విభాగాల్లో బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు జరిగే నష్టంపై మంగళవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా ములుగు జిల్లా ఏటూరునాగారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మంగపేటలోని జూనియర్ కాలేజీ, జనగామ జిల్లా దేవరుప్పులలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, మహబూబాబాద్ జిల్లా కురవి మండం నేరెడ గ్రామంలోని మోడల్, కస్తూర్బా గాంధీ జూనియర్ కాలేజీ విద్యార్థులకు బనకచర్ల జలదోపిడీని వివరించారు. ఈ సందర్భంగా కరపత్రాలు ఆవిష్కరించారు.
ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శులు రాజేశ్‌నాయక్, సత్యమూర్తి, రాష్ట్ర నాయకుడు కందికొండ తిరుపతి, ములుగు జిల్లా ఇన్చార్జి కోగిల మహేశ్, మహబూబాబాద్ జిల్లా కన్వీనర్ గుగులోత్ రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. కాగా నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలోనూ విద్యార్థులకు అవగాహన కల్పించారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎంఏఎల్‌డీ ప్రభుత్వ మహిళా జూనియర్, ప్రియదర్శిని డిగ్రీ, కొట్టం జూనియర్ కళాశాలలో, అయిజ ప్రభుత్వ జూనియర్, సాయితేజ ఒకేషనల్ కళాశాలలో బీఆర్ఎస్వీ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య, వనపర్తి ప్రభుత్వ మహిళా డిగ్రీ, వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలలో బీఆర్ఎస్వీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు హేమంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బనకచర్ల ప్రాజెక్టులో జరుగుతున్న జలదోపిడీ, నీటి వాటా కోసం విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదావరిలో తెలంగాణ వాటాను వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుతో ముఖ్యమంత్రి రేవంత్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ధ్వజమెత్తారు.
బనకచర్లను అడ్డుకుంటాం
గోదావరిలో తెలంగాణ వాటాను వదులుకునే ప్రసక్తే లేదని బీఆర్ఎస్వీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ స్పష్టంచేశారు. మంగళవారం బెల్లంపల్లిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ జల దోపిడీని అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. చంద్రబాబుతో చీకటి ఒప్పందం చేసుకున్న రేవంత్‌రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డితో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీల గోదావరి జలాలను రాయలసీమకు తరలించడం కోసం ఏపీ నిర్మించతలపెట్టిన అక్రమ ప్రాజెక్టే పోలవరం-బనకచర్ల లింకు ప్రాజెక్టు అని వెల్లడించారు. తెలంగాణ నీళ్లను ఆంధ్రకు తరలించే కుట్రను తిప్పికొడుతామని పేర్కొన్నారు. బనకచర్ల లింకు ప్రాజెక్టును రద్దు చేయని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో లక్షలాది మంది విద్యార్థులతో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.