వనపర్తి : దేశంలోని రైతులు యాచించే స్థితిలో కాకుండా శాసించే స్థాయిలో నిలిపేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ను ప్రకటించారని రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల నుంచి కాంగ్రెస్ కుచెందిన ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి కుర్మన్న, బీఎస్పీ మండల అధ్యక్షుడు గంధం స్వామిల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఆదివారం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్ లక్ష్యమని అన్నారు.బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. సంపద పెంచాలి .. ప్రజలకు పంచాలి అన్నది కేసీఆర్ ఆకాంక్షని తెలిపారు.దేశంలో నేరుగా లబ్దిదారుల ఖాతాలలోకి నిధులు జమచేస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణయేనని వెల్లడించారు.రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ , కేసీఆర్ కిట్, ఆసరా ఫించన్లు నేరుగా లబ్ధిదారుల చేతికి అందుతున్నాయని అన్నారు.
అబ్ కీ బార్ .. కిసాన్ సర్కార్ నినాదంతో దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టినందున కేంద్రంలో రాబోయేది రైతు ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. 60 శాతం మంది ఆధారపడి ఉన్న వ్యవసాయరంగం బలపడితేనే దేశం బలపడుతుందని, పనిచేసే ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఉండాలని ఆయన తెలిపారు.