స్టేషన్ ఘన్పూర్, డిసెంబర్ 1: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ విజయం సాధించి కేసీఆరే ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ స్టేషన్‌ఘన్‌పూర్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. స్టేషన్‌ఘన్‌పూర్‌లో విజయం సాధించిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, ఈ ఆచారం 1957 నుంచి ఇలాగే కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కూడా ఇక్కడ బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది కాబట్టి రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. కడియంతోనే అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో నియోజకవర్గంలో సీపీఎం, సీపీఐ, టీడీపీతోపాటు అక్కడక్కడ బీజేపీ వారు కూడా సానుకూలంగా స్పందించిన ప్రతిపక్షాలు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పరోక్షంగా సహకరించాయని కడియం తెలిపారు. కానీ సొంత పార్టీ వారే పరోక్షంగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేశారని, ఆ ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని కడియం వివరించారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులతోపాటు సొంత పార్టీ వారిని కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో శక్తికి మించి పనిచేసిన వారిని గుర్తు పెట్టుకుంటానని, వారిని కుటుంబ సభ్యుల్లా, కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పారు. ఈ ఎన్నికల సమయంలో ఎవరినైనా మనసు నొప్పించేలా మాట్లాడితే మనస్ఫూర్తిగా క్షమించాలని, కోపంతో అనలేదని, అందులోని ప్రేమను కూడా చూడాలని బీఆర్ఎస్ శ్రేణులను కోరారు.