MLC Kavitha | హైదరాబాద్ : పేదింటి ఆడబిడ్డల వివాహానికి కల్యాణమస్తు స్కీం కింద తులం బంగారం ఇస్తామన్న హామీని రేవంత్ రెడ్డి సర్కార్ నిలుపుకోలేకపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మ్యానిఫెస్టో ఖురాన్, బైబిల్, భగవద్గీతతో సమానం అని రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పారు. అది అబద్ధమని శాసనమండలి సాక్షిగా బయటపడింది. కల్యాణమస్తు పథకం ద్వారా లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని అన్నారు. కల్యాణమస్తు పథకం గురించి మేం అడిగిన ప్రశ్నకు ఆ పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచన లేదని కౌన్సిల్ సాక్షిగా సమాధానం చెప్పారు. ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడుతూన్నారు అని కవిత ధ్వజమెత్తారు.
మహిళల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కవిత మండిపడ్డారు. ఆడపిల్లలకు అండగా కేసీఆర్ నిలబడ్డారు. తల్లిదండ్రులకు అండగా పాప పుట్టునప్పటి నుండి పెళ్లి అయ్యే వరకు కేసీఆర్ వారికి వెన్నుదన్నుగా నిలిచారు. మహిళ వ్యతిరేక ముఖ్యమంత్రిగా చరిత్రలో రేవంత్ రెడ్డి నిలుస్తాడు. నిన్న అసెంబ్లీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి మహిళల పట్ల దురుసుగా మాట్లాడారు అది చీకటి రోజుగా భావిస్తున్నామని కవిత పేర్కొన్నారు.