హైదరాబాద్: ఈ నెల 19న జరగాల్సిన బీఆర్ఎస్ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం వాయిదా పడింది. బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) ఆదేశాల మేరకు డిసెంబర్ 21న ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ సీనియర్ నేత హరీశ్ రావు వెల్లడించారు. ఈ నెల 19వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం కోసం వాయిదా వేయడం జరిగింది. ఈనెల 21న కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ వేదికగా నిర్వహించే బిఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు పాల్గొననున్నారు.
కృష్ణా, గోదావరి జలాల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై, పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడంలో చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ఈ సమావేశంలో చర్చ జరుగనున్నది. గోదావరి, కృష్ణ జలాలను కొల్లగొడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దోపిడీని అడ్డుకోవడంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రజల రైతాంగ సాగునీటి హకులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదని బీఆర్ఎస్ భావిస్తున్నది. ఏపీ జలదోపిడీపై తెలంగాణ ప్రజా ఉద్యమాలు ఎలా చేపట్టాలనే అంశంపై పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి అధినేత కేసీఆర్ లోతుగా చర్చించనున్నారు.