హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తేతెలంగాణ):ప్రజాసమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే శాసనసభను 15 రోజులపాటు నడపాలని బీఆర్ఎస్ఎల్పీ డిమాండ్ చేసింది. గతంలో మాదిరిగా వాయిదా వేసుకొని పారిపోవద్దని స్పష్టంచేసింది. సోమవారం జరిగిన అసెంబ్లీ బిజినెస్ ఐడ్వెజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో బీఆర్ఎస్ఎల్పీ పలు అంశాలను ప్రతిపాదించింది. సోమవారం జీరో అవర్ తర్వాత సభ వాయిదా పడింది. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నేతృత్వంలో అసెంబ్లీ హాలులో బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, ప్రభాకర్, అయిలయ్య (కాంగ్రెస్), తన్నీరు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి (బీఆర్ఎస్),మహేశ్వర్‌రెడ్డి (బీజేపీ),అక్బరుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం), కూనంనేని సాంబశివరావు (సీపీఐ) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ఎల్పీ తరఫున హరీశ్‌రావు సభలో చర్చించాల్సిన అంశాలను ప్రతిపాదించారు. రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై చర్చించాల్సిందేనని డిమాండ్ చేశారు. యూరియా కొరత, రుణమాఫీ, పంటల బోనస్, రైతు భరోసా, అన్నదాతల ఆత్మహత్యలపై సమగ్ర చర్చ జరగాలని కోరారు. వందరోజుల్లో అమలు చేస్తామన్న గ్యారెంటీలు రెండేండ్లు దాటినా అమలుకాని తీరు, అన్నివర్గాలు మోసపోయిన వైనంపై చర్చించాలని ప్రతిపాదించారు. ఫార్మాసిటీ రద్దు, ఫ్యూచర్‌సిటీ పేరిట భూముల ధారాదత్తం, హిల్ట్ పాలసీ ముసుగులో రూ.5 లక్షల కోట్ల కుంభకోణం, ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్న తీరుపై సభలో చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. కొత్త థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణానికి తెచ్చిన పాలసీలోని లోపాలు, జరిగిన అవినీతి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వ తప్పిదాలు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్, ఏటా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్లలో జా ప్యం అంశాలను ఏజెండాలో చేర్చాలని కోరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్ల క్ష్యం, డీపీఆర్ వెనక్కి పంపడం, 45 టీఎంసీలకు ఒప్పుకొని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయ డం, తద్వారా తెలంగాణ ప్రయోజనాలకు కల్గించిన విఘాతంపై చర్చించాలని ప్రతిపాదించారు.