హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతి కొనసాగుతున్నది. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A జాబితా పేరిట అక్రమార్జనకు సాధనంగా వాడుకుంటున్నారు. ఈ విషయంపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదురొంటున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి’ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాహుల్‌గాంధీకి గురువారం ఆయన బహిరంగ లేఖ రాశారు.
రెవెన్యూశాఖ పరిధిలో జరుగుతున్న ఈ భూదందాపై కాంగ్రెస్ అధిష్ఠానం స్పందించాలని, విచారణ పూర్తయ్యే వరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకుంటే తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ, నిషేధిత భూముల రిజిస్ట్రేషన్‌ను అడ్డుకోవడానికి ఉద్దేశించిన సెక్షన్ 22Aను ప్రైవేట్ ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టించి, ప్రజల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడటానికి వాడుకుంటున్నారని విమర్శించారు.
ఎంతో విలువైన భూములున్న జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, నిజాంపేట్ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మలాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అనుమతులున్న వేలాది ప్రైవేట్ ఆస్తులను ఏకపక్షంగా 22A నిషేధిత జాబితాలో చేర్చారని వివరించారు. నిషేధిత జాబితా నుంచి భూమి లేదా ఆస్తి పేరును తొలగించడానికి దళారులు మారెట్ విలువలో ఏకంగా 30 శాతం వరకు కమీషన్లు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. యాదాద్రి-భువనగిరి జిల్లాలో 40 వేల ఎకరాలను 22A జాబితాలో చేర్చారని మంత్రి కోమటిరెడ్డి 4 నెలల క్రితమే బహిరంగంగా చెప్పినా, సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
జాబితాను పబ్లిక్ డొమైన్లో ఉంచాలి
ప్రజా ప్రయోజనార్థం జిల్లాలవారీగా 22A నిషేధిత భూముల జాబితాను ఆన్లైన్ వేదికగా పబ్లిక్ డొమైన్లో పారదర్శకంగా ఉంచాలని హరీశ్‌రావు తన లేఖలో డిమాండ్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పరిసరాల్లో ఉన్న విలువైన భూములపై వివాదాలు సృష్టించి, రాజకీయ పలుకుబడి ఉన్న బినామీ సంస్థలతో 50:50 నిష్పత్తిలో జాయింట్ డెవలప్మెంట్ ఒప్పందాలు చేసుకోవాలని ఆ భూముల యజమానులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని హరీశ్‌రావు తన లేఖలో పేర్కొన్నారు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 22A జాబితాలో చేర్చిన, తొలగించిన ప్రతి ఒక్కరి భూమి వివరాలపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర కమిషన్‌తో విచారణ జరిపించేందుకు చొరవ చూపాలని డిమాండ్ చేశారు.
ఏ అధికారి ఆదేశంతో ఏ ఆస్తిని నిషేధిత జాబితాలోకి తెచ్చారు? మళ్లీ ఎలా తొలగించారు? ఈ క్రమంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కోరారు. దశాబ్దాల క్రితమే అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ) కింద క్రమబద్ధీకరించిన భూములను, చెల్లుబాటయ్యే రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్న ప్రైవేట్ పట్టీలను మళ్లీ 22Aలో పెట్టి యజమానులను నరకయాతనకు గురిచేస్తున్నారని తెలిపారు. ఎన్నికల ముందు ‘భూమాత’ తెస్తామని చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక ప్రజల ఆస్తులను లాక్కొనే రాబందులా మారిందని విమర్శించారు. తమ ఆరోపణలు అబద్ధమైతే వెంటనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్వతంత్ర విచారణకు ఆదేశించి నిజాయితీ నిరూపించుకోవాలని, లేనిపక్షంలో బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టంచేశారు.