హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తేతెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ నెల 22న హైకోర్టు తీర్పు, ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లతో చర్చించేందుకు బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్‌రావు సోమవారం ఢిల్లీ వెళ్లా రు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌తో కలిసి ఢిల్లీలో ఆయా అంశాలపై చర్చలు జరుపుతున్నారు. సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లను కలిసేందుకు కొన్ని రోజుల ముందే షెడ్యూల్ కుదరగా ఆ మేరకు హరీశ్ ఢిల్లీకి వెళ్లారు. హరీశ్ ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ నేతలు దు ష్ప్రచారం చేశారు. జగిత్యాల సభకు డుమ్మా కొట్టి ఢిల్లీ వెళ్లారని ఆ పార్టీ సోష ల్ మీడియా హ్యాండిల్లో తప్పుడు ప్ర చారం సాగించారు.
ఆయన పార్టీ అధినాయకత్వంపై అలకబూని ప్రజాఆశీర్వాద సభ కు దూరంగా ఉన్నారని సోమవారం ఉదయం నుంచి తప్పుడు పోస్టులతో ప్రజలను తప్పుదోవ పట్టించడంపై గులాబీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ దుష్ప్రచారాన్ని హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. పొద్దున కాంగ్రెస్ తరఫున మాట్లాడి రాత్రి బీజేపీ నేతలతో చర్చలు జరపడం, కేంద్ర మంత్రుల ఇండ్లకు విందులకు వెళ్లడం రేవంత్‌రెడ్డికి అలవాటేనని దెప్పిపొడిచారు. బీఆర్ఎస్లో ఏదో కలకలం చెలరేగాలని వారు గుంతకాడి నక్కల్లా ఎదురుచూస్తున్నారని దుయ్యబట్టారు. వారి ఆశలు అడియాసలు కాక తప్పవని, దుర్మార్గపు కాంగ్రెస్‌ను గద్దెదింపేందుకు సంఘటితంగా పోరా టం చేస్తామని తేల్చిచెప్పారు. ఇకనైనా తనపై, బీఆర్ఎస్పై పిచ్చిప్రేలాపనలు మానుకోవాలని హితవుపలికారు.
సుప్రీంకోర్టు న్యాయవాది సుందరంతో బీఆర్ఎస్ బృందం భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ త్రిసభ్య బృందం సోమవారం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరంతో సమావేశమైంది. పార్టీ అధినేత కేసీఆర్ఆదేశాల మేరకు ఢిల్లీ వెళ్లిన మాజీ మంత్రి హరీశ్‌రావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ఆయనను కలిశారు. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్‌పై త్వరలో రానున్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలతోపాటు, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో న్యాయపరంగా తీసుకోవాల్సిన తదుపరి కార్యాచరణపై సుందరంతో చర్చించారు.