హైదరాబాద్, మే 10(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం నడుస్తున్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు ఆరోపించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసు వ్యవహారంపై ఆదివారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ప్రభుత్వ, పోలీసుల వైఫల్యాలను ఎత్తిచూపారు. ‘బాధితురాలు న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే కేసు నమోదుకు ఎనిమిది గంటలు ఎందుకు పట్టింది? కేసు నమోదై 48గంటలు దాటినా నిందితుడిపై చర్యలు తీసుకొనేందుకు పోలీసులు ఎందుకు వెనుకాడుతున్నారు? హోం మంత్రిగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి?’ అంటూ ప్రశ్నలవర్షం కురిపించారు. కేసు నమోదులో తాత్సారం, నిందితుడిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్న తీరు రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనం కాదా? అని నిలదీశారు.