హైదరాబాద్, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్ ఆధిపత్యం ప్రదర్శించింది. సీఎం రేవంత్‌రెడ్డి కలల ప్రాజెక్టు ఫ్యూచ ర్ సిటీ ప్రధాన గ్రామం, ఇటీవలే గ్లోబల్ సమ్మి ట్ నిర్వహించిన గ్రామం మీర్‌ఖాన్‌పేటలోనూ బీఆర్ఎస్ విజయం సాధించింది. సర్పంచ్ ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ సత్తా చాటగా, కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకొన్నది. సీఎం కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేసినా ప్రజలు పట్టించుకోలేదు.
అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పు రేవంత్‌రెడ్డికి మింగుడుపడకపోగా, అదే సమయంలో ప్రజల్లో బీఆర్ఎస్పై పాజిటివ్ టాక్ పెరుగుతుండటం మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు తంటాలు పడుతున్నారు. సాధారణంగా సీఎం స్థాయి వ్యక్తి సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై ప్రెస్‌మీట్ పెట్టి వివరాలు వెల్లడించిన సందర్భాలు ఇటు తెలంగాణలో, అటు ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడూలేవు. కానీ ఈసారి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై ప్రెస్‌మీట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగవు., ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచిందనే లెక్కలు పక్కాగా ఉండవు. కానీ సీఎం మాత్రం లెక్కలతో మీడియా ముందుకొచ్చి, కాంగ్రెస్ అధిక స్థానాలు గెలిచిందని చెప్పుకోవడానికి నానా తిప్పులు పడ్డారు, పొంతనలేని లెక్కలు చెప్పా రు. కాంగ్రెస్ సొంతంగా 7,527 సీట్లు గెలుచుకుందని, రెబల్స్‌గా మరో 808తో కలిపి మొత్తంగా 8,335 సీట్లు హస్తగతం చేసుకున్నదని ప్రకటించుకున్నారు. అంటే అటు రెబెల్స్, ఇటు ఏకగ్రీవాలను కూడా ఖాతాలో కలుపుకోవడం ఆయనకే చెందింది. మరో రకంగా ప్రతిపక్ష పార్టీని మరింత తక్కువ చేసే చూపేందుకు బీఆర్ఎస్ కేవలం 3,511 సీట్లు గెలుచుకుందని, అందునా అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ కలిసి పోటీ చేశాయనీ నిందలేశారు.
సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో సీఎంకి దిమ్మతిరిగిందని, అందుకే పొంతన లే కుండా రెండు నాల్కల ధోరణిలో వ్యాఖ్యలు చేశారనే విమర్శలున్నాయి. ప్రెస్మీట్లో భా గంగా తొలుత ఫలితాలు ప్రభుత్వ పనితీరుకు ప్రజలిచ్చిన తీర్పుగా అభివర్ణించిన సీఎం, కొద్ది సేపటికే పంచాయతీ ఎన్నికలతో పార్టీకి, ప్రభుత్వానికి సంబంధం లేదని వక్రబుద్ధిని చూపుకొన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో మంత్రినో, ముఖ్యమంత్రినో చూసి ఓటు వేయరని ప్రకటించారు. ఇలా పరస్పర విరుద్ధమైన మాటలతో సీఎం గందరగోళానికి తెర తీశారు.
మెస్సీ టూర్ వివాదంపై సీఎం స్పందించారు. టూర్‌కు ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. కాగా, సింగరేణి రూ.10 కోట్లు ఇవ్వడంపై విలేకరులు ప్రశ్నించగా స్పందిస్తూ టూర్ మొత్తం ప్రైవేటు ఏజెన్సీ నిర్వహించిందని, ఆ సంస్థ ఇతర కంపెనీల నుంచి స్పాన్సర్లు తీసుకుందన్నారు. ఇందులో భాగంగానే సింగరేణి సీఎస్ఆర్ ఫండ్‌లో భాగంగా ఇ చ్చిందని, సింగరేణి ఇస్తే తమకేం సంబంధమ ని వ్యాఖ్యానించారు. అయితే సింగరేణి లాం టి ప్రభుత్వరంగ సంస్థ, సీఎంకు తెలియకుం డా, ఆయన ఆమోదం లేకుండా ఈవెంట్‌కు సీఎస్ఆర్ ఇస్తుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇచ్చినా గుడికో, పేదల వృద్ధికో, అనాథలకో ఇవ్వాలిగానీ ఇలా ప్రైవేటు సంస్థ నిర్వహించే ఈవెంట్‌కు స్పాన్సర్ చేయడం ఏంటనే విమర్శలున్నాయి. మనుమడిని మెస్సీతో ఫుట్‌బాల్ ఆడించడంపై వస్తున్న విమర్శలపైనా సీఎం స్పందిస్తూ మనువడిని ఫుట్‌బాల్ క్రీడాకారున్ని చేయాలని అనుకుంటున్నామని, అందుకే ఆటకు తీసుకెళ్లామని సెలవిచ్చారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఇచ్చిన తీర్పుపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. దీనిపై తాము స్పందించడానికి ఏం లేదన్నారు. ఒకవేళ స్పీకర్ తీర్పుపై అభ్యంతరాలుంటే కోర్టులున్నాయని తెలిపారు. ఆ ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్లోనే ఉన్నామని చెబుతున్నారని, అలాంటప్పుడు తమ అభిప్రాయాలతో సంబంధం ఏంటని సీఎం పేర్కొన్నారు.