పదేండ్ల కేసీఆర్ పాలనలో కొనసాగిన వికాసానికి మద్దతిచ్చి, రెండేండ్ల రేవంత్ పాలనా విధ్వంసానికి చరమగీతం పాడాలె. కారుకు ఓటేసి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతమ్మను గెలిపిస్తేనే ఆరు గ్యారెంటీలు నడుచుకుంటూ వస్తయని గుర్తుంచుకోవాలె. వృద్ధులకు రూ.4 వేల పింఛన్ రావాలన్నా.. మహిళలకు ప్రతినెలా రూ. 2500 ఖాతాలో పడాలన్నా.. ఆడబిడ్డ పెండ్లికి రూ.లక్షతో పాటు తులం బంగారం రావాలన్నా కారు గుర్తుకు ఓటేసి బేకార్ కాంగ్రెస్‌ను తరిమికొట్టాలె.
-జూబ్లీహిల్స్ ప్రజలకు కేటీఆర్ పిలుపు
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తేతెలంగాణ): ‘హైడ్రా దుర్మార్గాలకు అడ్డుకట్ట పడాలం టే కాంగ్రెస్‌ను పచ్చడి చేయాలి. హస్తంపార్టీకి ఓటుతో బుద్ధి చెప్పి ఆరు గ్యారెంటీలపై మాట తప్పిన సీఎం రేవంత్‌రెడ్డి కండ్లు తెరిపించాలి’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ ఓటర్లకు పిలుపునిచ్చారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో కొనసాగిన వికాసానికి మద్దతిచ్చి, రెండేండ్ల రేవంత్ పాలనా విధ్వంసానికి చరమగీతం పాడాలని విజ్ఞప్తిచేశారు. కారుకు ఓటేసి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతమ్మను గెలిపిస్తేనే ఆరు గ్యారెంటీలు నడుచుకుంటూ వస్తాయని గుర్తుంచుకోవాలని సూచించారు. ‘వృద్ధులకు రూ. 4 వేల పింఛన్ రావాలంటే, మహిళలకు ప్రతినెలా రూ. 2,500 ఖాతాలో పడాలంటే, పెండ్లిచేసిన ఆడబిడ్డలకు రూ. లక్షతో పాటు తులం బంగారం కావాలంటే, కారుకు ఓటేసి బేకార్ కాంగ్రెస్‌ను తరిమికొట్టాలి’ అని సూచించారు. కత్తి బీఆర్ఎస్ చేతికిస్తేనే కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలపై అసెంబ్లీలో గల్లాపట్టి అడుగుతామని ప్రకటించారు.
జూబ్లీహిల్స్ గడ్డపై కారుకు బుల్డోజర్కు మధ్య జరుగుతున్న ఎన్నికల పోరులో గులాబీ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతమ్మ అఖండ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. గెలుపు గులాబీదేనని, తేలాల్సింది మెజార్టీయేనని స్పష్టం చేశారు. శుక్రవారం వెంగళరావునగర్‌లో కేటీఆర్ అట్టహాసంగా రోడ్ షో నిర్వహించారు. వెల్లువలా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలు, ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరును వీడియోలు చూపించి ఎండగట్టారు. వెంగళరావునగర్ డివిజన్ వాసుల జోరు, జోష్ చూస్తుంటే జూబ్లీహిల్స్ గడ్డపై తిరిగి గులాబీ జెండా ఎగరడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. గతంలో ఈ డివిజన్లో గోపీనాథ్‌కు బ్రహ్మాండమైన మెజార్టీ కట్టబెట్టారని, ఇప్పుడు అంతకుమించి ఆధిక్యాన్ని ఇవ్వాలని ప్రజలను కోరారు.

24 నెలల పాలనలో అంతులేని అరాచకాలు
24 నెలల కాంగ్రెస్ పాలనలో అంతులేని అరాచకాలు, హైడ్రా పేరిట విధ్వంసం తప్ప సాధించిందేమీ లేదని కేటీఆర్ విరుచుకుపడ్డారు. రేవంత్‌రెడ్డి పేదలు నివసించే బస్తీలు, ఇండ్లపైకి బుల్డోజర్లను పంపి విధ్వంసం సృష్టించారని నిప్పులుచెరిగారు. చెరువుల్లో కట్టుకున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, వివేక్, సీఎం అన్న తిరుపతిరెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి ఇండ్లను వదిలిపెట్టి పేదల గూళ్లను కూల్చి నిలువనీడలేకుండా చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కబ్జా చేసిన 11 ఎకరాలను కాపాడిన ఘనత హైడ్రాకే దక్కిందని ఎద్దేవా చేశారు. రెండేండ్లలో చేసిన మంచిపని ఒక్కటి కూడా లేదని, కానీ వేలాది ఇండ్లను మాత్రం కూలగొట్టారని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఇండ్లు కూల్చడం, పేదలను కాల్చుకుతినడమేనా రేవంత్‌రెడ్డీ అని సూటిగా ప్రశ్నించారు.
కేసీఆర్ హయాంలోనే అగ్రగామిగా హైదరాబాద్
కేసీఆర్ పదేండ్ల పాలనలోనే హైదరాబాద్ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని కేటీఆర్ పేర్కొన్నారు. జోడెద్దుల్లా అభివృద్ధి, సంక్షేమాన్ని కేసీఆర్ పరుగులు పెట్టించారని గుర్తుచేశారు. ‘పెద్దోళ్ల పింఛన్లను రూ. 2,000కు పెంచారు. పెండ్లి చేసుకున్న 10 లక్షల మంది ఆడబిడ్డలకు రూ. లక్ష చొప్పున కట్నం పెట్టారు. పురుడు పోసుకున్న లక్షలాది మంది మహిళలకు కేసీఆర్ కిట్లు ఇచ్చి గౌరవించారు. హైదరాబాద్ నగరంలో 42 ఫ్లైఓవర్లు నిర్మించారు. 42 కిలోమీటర్ల మెట్రో రైల్ వేశారు. ఐటీని అభివృద్ధి చేసి 6 లక్షల ఉద్యో గాలు సృష్టించారు. 2014లో రూ. 57 వేల కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులను రూ. 2.41లక్షల కోట్లకు పెంచారు. ఎవరికైనా సుస్తీ చేస్తే 350 బస్తీ దవాఖానలు అందుబాటులోకి తెచ్చారు. వెంగళరావునగర్‌లో వెయ్యి పడకల దవాఖాన కట్టారు. రూ. 5 భోజనంతో పేదల కడుపు నింపారు. డయాగ్నొస్టిక్ సెంటర్లు పెట్టారు’ అని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ హయాంలో మాత్రం కేసీఆర్ ప థకాలను నిలిపివేయడం తప్ప చేసింది శూన్యమని నిప్పులు చెరిగారు.
రియల్ ఎస్టేట్ కుదేలు
ఉద్దెర హామీలిచ్చి ప్రజల ఓట్లు కొల్లగొట్టి గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి ఆచరణలో మాత్రం మొండి చెయ్యి చూపుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఆసరా పింఛన్ పెంపు, మహిళలకు నెలకు 2,500 ఇస్తామని మోసం చేశారని మండిపడ్డారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలంటూ ముంచారని ధ్వజమెత్తారు. ‘రెండేండ్లలో ఎవరికైనా మంచి జరిగిందా? మహిళల్లో ఒక్కరినైనా కోటీశ్వరులను చేశారా?’ అని సభకు వచ్చిన వారిని ఉద్దేశించి ప్రశ్నించగా లేదు..లేదు అని సమాధానమిచ్చారు. దానవీర శూరకర్ణ సినిమాలో మాదిరిగా డైలాగులు కొట్టిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ‘24 నెలల్లో హైదరాబాద్‌ను బర్బాద్ చేశారు. రియల్ ఎస్టేట్‌ను కుదేలు చేశారు. 162 మంది ఆటోడ్రైవర్లు. 110 మం ది గురుకుల పిల్లల మరణాలకు కారణమయ్యారు’ అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
పారిశ్రామికవేత్తలకు బెదిరింపులు
రూ. లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో గన్ కల్చర్ తీసుకువచ్చారని కేటీఆర్ ఆరోపించారు. వాటాల కోసం మంత్రులు పంచాయితీలు పెట్టుకుంటూ పారిశ్రామికవేత్తల కణతలపై గన్ను లు పెట్టి బెదిరిస్తున్నారని, ముఖ్యమంత్రి కమీషన్లు దండుకుంటూ ఢిల్లీకి మూ టలు పంపడంలో మునిగితేలుతున్నారని ధ్వజమెత్తారు. ఆడబిడ్డలకు ఫ్రీబస్సు తెచ్చి పురుషులకు టికెట్ రేట్లను డబుల్ చేశారని, కుడిచేత్తో ఇచ్చి ఎడమచేత్తో గుంజుకుంటున్నారని ఆరోపించారు.
ఓట్ల కోసమే ఎన్టీఆర్‌పై ప్రేమ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓట్ల కోసమే రేవంత్‌రెడ్డి ఎన్టీఆర్‌పై ఎనలేని ప్రేమను ఒలకబొస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. గతంలో ఎన్టీరామారావును దూషించిన వీడియాను చూపుతూ సీఎం వైఖరిని తనదైన శైలిలో ఎండగట్టారు. రెండేండ్లుగా గుర్తుకురాని ఎన్టీఆర్ విగ్రహాలు ఇప్పుడే ఎందుకు గుర్తుకు వస్తున్నాయని నిలదీశారు. అయినా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన విషయాన్ని ప్రస్తావించారు. ‘శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఎన్టీఆర్ పేరును తొలగించింది ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ కాదా? ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని రద్దుచేసింది కాంగ్రెస్‌కు చెందిన ఇందిరమ్మ కాదా? మరి అప్పుడు పగందుకు? ఇప్పుడు అంత ప్రేమెందుకు?’ అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు.
కాంగ్రెస్ గెలుపు కోసమే బీజేపీ ఆరాటం
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపు కోసమే బీజేపీ నేతలు ఆరాటపడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. అందుకే హిందూముస్లింలు అంటూ ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. మొన్న ఇక్కడ సభపెట్టిన ఆ పార్టీ పెద్దలు రేవంత్‌రెడ్డిని వెనకేసుకొచ్చి కేసీఆర్‌ను మాత్రం తూలనాడారని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని బీజేపీ అండతో పాలన నడుపుతున్న కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పడం ఖాయమని స్పష్టంచేశారు.

కంటోన్మెంట్లో ఉద్ధరించిందేంటి?
కాంగ్రెస్‌ను గెలిపిస్తే రూ.4000 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు విస్మరించారని కేటీఆర్ ఆరోపించారు. ఆరు వేల ఇందిరమ్మ ఇండ్లు కడతామని చెప్పి కనీసం ఒక్క ఇల్లు కూడా ఇవ్వని ఘనుడు రేవంత్‌రెడ్డేనని దెప్పిపొడిచారు. కాం గ్రెస్‌కు చెందిన మహబూబ్‌నగర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలకు నిధులివ్వని ఆయన జూబ్లీహిల్స్ ప్రజలను ఉద్ధరిస్తానని ఉద్దెర మాటలు చెప్ప డం హాస్యాస్పదమన్నారు. అమ్మకు అన్నం పె ట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు పెట్టిన చందంగా రేవంత్ అబద్ధాలతో ఓట్లు దండుకునేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు.
న్యాయ నిర్ణేతలు మీరే
కేసీఆర్ పదేండ్ల పాలన సృష్టించిన అద్భుతాలు, చేపట్టిన అభివృద్ధి పనులు, కట్టిన ఫ్లైఓవర్లు అన్నీ కండ్లముందే కదలాడుతున్నాయని గుర్తుచేశారు. రెండేండ్ల రేవంత్ పాలనలో హైడ్రా పేరిట సాగిన విధ్వంసం, చేసిన దందాలు మీకు తెలిసిందేనని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయనిర్ణేతలని, విజ్ఞతతో వ్యవహరించి సునీతమ్మను గెలిపించాలని కోరారు. ఆరు గ్యారెంటీలు రావాలన్నా, పింఛన్లు పెరగాలన్నా, విద్యార్థినులకు స్కూ టీలు రావాలన్నా గులాబీ పార్టీని గెలిపించాలని అర్థించారు. కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకొని ప్రగతిని పట్టాలెక్కించుకోవాలని పిలుపునిచ్చారు.
మూడో నంబర్‌పై కారు గుర్తు
పైనుంచి మూడో నంబర్ కారు గుర్తు అని, ప్రజలు పొరపాటు చేయవద్దని కేటీఆర్ సూ చించారు. సునీతమ్మను చూసి మూడో నంబర్ బటన్ నొక్కి లైట్ వెలిగిస్తే రేవంత్‌రెడ్డి ఇంట్లో కరెంట్ బంద్ అవుతుందని చమత్కరించారు. నవంబర్ 14న బీఆర్ఎస్ ఘన విజయం తథ్యమని పునరుద్ఘాటించారు. పోరాడే వారికే కత్తి ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.
జూబ్లీహిల్స్ ప్రజలకు అండగా ఉంట: మాగంటి సునీత
కారు గుర్తుపై ఓటేసి బీఆర్ఎస్ను గెలిపిస్తే జూబ్లీహిల్స్ ప్రజలకు అండగా ఉంటానని ఆభ్యర్థి మాగంటి సునీత భరోసానిచ్చారు. గోపీనాథ్ ఫోన్‌కు అర్ధరాత్రి కాల్చేసినా స్పందించి ఆదుకునేందుకు ముందుకువస్తానని ప్రకటించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ హయాంలో వేలకోట్లతో అభివృద్ధి పనులు కళ్లముందే కనిపిస్తున్నాయని, ఓటర్లు చెప్తున్నారన్నారు. కేసీఆర్ హయాంలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందాయని, వాటిని అందుకున్న వారంతా రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేస్తామని చెప్తున్నారని పేర్కొన్నారు. రాజకీయాల కోసం తన కుటుంబంపై కుట్రలు చేస్తున్నారని, నియోజకవర్గమే కుటుంబంగా భావించిన మాగంటి గోపీనాథ్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు చిల్లర ప్రయత్నాలు ప్రారంభించారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ధర్మమే గెలుస్తుందని, నియోజకవర్గంలోని ప్రజలంతా కుట్రలను గమనించాలని కోరారు.
ఓటమిని అంగీకరించిన రేవంత్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోతాననే విషయం రేవంత్‌రెడ్డికి తెలిసిపోయిందని కేటీఆర్ చెప్పారు. అందుకే ఈ ఎన్నికను ప్రభుత్వానికి రెఫరెండం కాదని ప్రెస్మీట్లో చెప్పారని గుర్తుచేశారు. వెంగళరావునగర్ డివిజన్ వాసుల ఉత్సాహం చూస్తుంటే సీఎం చెప్పిన మాటలు వాస్తవమేనని దెప్పిపొడిచారు. రేవంత్‌కు దమ్ముధైర్యం ఉంటే 24 నెల ల్లో చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన పథకాలను చూపి ఓట్లడగాలని డిమాండ్ చేశారు. కానీ ఆయన ఎన్నికల సభల్లో కేసీఆర్‌ను దూషిస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ, ఫోన్‌ట్యాపింగ్‌ను అడ్డంపెట్టుకొని కేసులు పెట్టించి కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. 25 ఏండ్లలో చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్, రోశయ్య లాంటి ముఖ్యమంత్రులను చూశామని, వారు ప్రజలకు మేలు చేశారని, అభివృద్ధిని కొనసాగించారని గుర్తుచేశారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో అన్నిరంగాలు, అన్నివర్గాలకు మేలు చేసి తెలంగాణను అగ్రగామిగా నిలిపారని కొనియాడారు. కానీ రేవంత్ పాలనలో మాత్రం ప్రజలను నిండాముంచుతున్నారని విమర్శించారు.

బీఆర్ఎస్ను గెలిపిస్తే జూబ్లీహిల్స్‌లో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం
కేసీఆర్ పాలనలో ఎన్టీఆర్‌కు సముచిత గౌరవమిచ్చారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఖమ్మం లంకారం పార్కు వద్ద, కూకట్‌పల్లిలో విగ్రహాలను పెట్టించిన ఘనత ఆయనకే దక్కిందని పేర్కొన్నారు. మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ పరిధిలో ఎన్టీఆర్ విగ్రహాలను నెలకొల్పి ఆ మహనీయుడిని ఆదరించారని చెప్పారు. ఈ ఉప ఎన్నికలో కా రు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను గెలిపిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.
వృద్ధులకు రూ. 4 వేల పింఛన్ రావాలంటే, మహిళలకు ప్రతినెలా రూ. 2,500 ఖాతాలో పడాలంటే, పెండ్లిచేసిన ఆడబిడ్డలకు రూ. లక్షతో పాటు తులం బంగారం కావాలంటే, కారుకు ఓటేసి బేకార్ కాంగ్రెస్‌ను తరిమికొట్టాలి.
-కేటీఆర్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓడిపోతాననే విషయం సీఎం రేవంత్‌రెడ్డికి తెలిసిపోయింది. అందుకే ఈ ఎన్నికను ప్రభుత్వానికి రెఫరెండం కాదని ప్రెస్మీట్లో తేల్చి చెప్పిండు. వెంగళరావునగర్ డివిజన్ వాసుల ఉత్సాహం చూస్తుంటే సీఎం చెప్పిన మాటలు వాస్తవమేనని స్పష్టమవుతున్నది. రేవంత్‌కు దమ్మూధైర్యం ఉంటే 24 నెలల్లో చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన పథకాలను చూపి ఓట్లడగాలె.
– వెంగళరావునగర్ రోడ్ షోలో కేటీఆర్
రేవంత్‌రెడ్డి పేదలు నివసించే బస్తీలు, ఇండ్లపైకి బుల్డోజర్లను పంపి విధ్వంసం సృష్టించారు. చెరువుల్లో కట్టుకున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, వివేక్, సీఎం అన్న తిరుపతిరెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి ఇండ్లను వదిలిపెట్టి పేదల గూళ్లను కూల్చి నిలువనీడలేకుండా చేశారు.
-కేటీఆర్